ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: వర్షాభావ పరిస్థితులతో కరువు తాండవిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కరువు మండలాలను ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బుధవారం విజయవాడలోని దాసరిభవన్‌లో ఆయన పార్టీ రాష్ట్ర నాయకులు జెవి సత్యనారాయణ, జెవివి ప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 679 మండలాల్లో 300కుపైగా మండలాల్లో తీవ్ర వర్షాభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా నీళ్లు అందించే అవకాశం వున్నా.. ప్రభుత్వ అసమర్థత కారణంగా కృష్ణా డెల్టా కింద ఆయకట్టు ఎండిపోతోందన్నారు. రాష్ట్రంలో కరువు సమస్యపై అన్ని రాజకీయ పార్టీలనూ, రైతు సంఘాలనూ, ప్రజా సంఘాలనూ కలుపుకుని ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు. అధికార పార్టీ నాయకులు పుంగనూరులో టిడిపి కార్యకర్తలను అడ్డుకుని, చొక్కా విప్పించి దౌర్జన్యానికి పాల్పడటాన్ని అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రానికి తెలియకుండా రాష్ట్రం అప్పులు చేస్తోందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రూ.వేలకోట్ల లిక్కర్ స్కామ్ జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్, ఆర్థిక అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కోరితే కేంద్రం ఏమి సమాధానం చెప్పిందో ప్రజలకు పురందేశ్వరి వివరించాలని డిమాండ్ చేశారు. బిజెపి, వైసిపి రాష్ట్రంలో డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు.