Sep 17,2023 10:02

హైదరాబాద్‌ : కమ్యూనిస్టుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే భారతదేశంలో తెలంగాణ విలీనమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. రైతాంగ సాయుధ పోరాట చరిత్రకు ఏమాత్రం సంబంధం లేని బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు తెలంగాణ చరిత్రను హైజాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన సాయుధ పోరాటానికి బీజేపీ మతం రంగు పులిమేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ రోజు మరో గత్యంతరం లేకే నిజం లొంగిపోయారని, కమ్యూనిస్టులకు అధికారం ఎక్కడ దక్కుతుందోనని పటేల్‌ సైన్యంతో నిజాం కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు విలీన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కేసీఆర్‌ అన్నారని గుర్తు చేశారు. మరిప్పుడు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. సీపీఐ ఆధ్వర్యంలో నేడు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.