Oct 18,2023 21:45

- కృష్ణాజలాల పున:పంపిణీ రాష్ట్ర స్థాయి సదస్సులో వక్తలు
ప్రజాశక్తి- కడప ప్రతినిధి:కృష్ణాజలాల పున:పంపిణీ వ్యవహారంపై రాష్ట్రంలోని బిజెపియేతర పార్టీలన్నీ సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని పలువురు వక్తలు కోరారు. కృష్ణాజలాల పున:పంపిణీపై గెజిట్‌ నోటిఫికేషన్‌, రాష్ట్ర భవిష్యత్‌, సీమ ప్రాజెక్టులపై కడపలోని వైఎస్‌ఆర్‌ ఆడిటోరియంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఓబులేసు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ఎగువ రాష్ట్రమైన కర్ణాటకలో అప్పర్‌భద్రను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమే గాకుండా రూ.ఆరు వేల కోట్లను కేంద్రం కేటాయించిందని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జలాలను పున:పంపిణీ చేయాలనే పేరుతో బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ను వేయడం దుర్మార్గమని తెలిపారు. 2025 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని తెలిపారు. దసరా అనంతరం విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్‌ మాట్లాడుతూ..కృష్ణాజలాల పున:పంపిణీపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తే అఖిలపక్షాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ముఖ్యమంత్రిని నిలదీశారు. ఉద్యమ ఎజెండాను రూపొందించి అధికార, ప్రతిపక్షాల ఎదుట ఉంచుతామని తెలిపారు. రాయలసీమ వ్యాప్తంగా చర్చ నడిచేలా కార్యాచరణకు రూపకల్పన చేస్తామన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 63 లక్షల హెక్టార్లలో 34 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు.పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి రాహుకేతువులుగా మారాయన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల కారణంగా నికర, మిగుల జలాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు నేత దశరథరామిరెడ్డి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు వనజ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వర రావు, జన చైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్‌రెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు రామచంద్రయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్‌ ప్రసంగించారు. కార్యక్రమానికి నగరంలోని పలువురు ప్రముఖులు, ప్రజాసంఘాల నాయకులు, పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు.