- వ్యవసాయ మోటార్లకు మీటర్ల ప్రతిపాదన మానాలి!
- విద్యుత్ షాక్ తో ప్రభుత్వ పతనం ఖాయం- సిపిఐ
ప్రజాశక్తి-పుంగనూరు : రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ చార్జీలను అమాంతంగా పెంచడం దుర్మార్గమని సత్వరం చార్జీలు తగ్గించకుంటే ప్రభుత్వ పతనం తప్పదని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.జనార్ధన్ పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు పెంపు ను నిరసిస్తూ 9 కమ్యూనిస్టు పార్టిల రాష్ట్ర వ్యాప్త పోరాటంలో భాగంగా బుధవారం పుంగనూరు అంబేద్కర్ విగ్రహం వద్ద పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జనార్ధన్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్భంగా విద్యుత్ చార్జీలను పెంచనని సియం ఇచ్చిన హామీ బూటకమని నేడు ఋజువైందన్నారు. గృహ విద్యుత్తు టారిఫ్ ను గత 4సంవత్స రాలలో 4సార్లు పెంచారని, తెలిపారు. పెంచిన ప్రతి సారీ సర్ధుబాటు చార్జీలని, ట్రూఅఫ్,ఇందన సెస్, పేర్లతో కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ చార్జీలు అమాంతంగా పెంచేస్తున్నారని తెలిపారు.. అలాగే ఉచిత విద్యుత్ ను క్రమంగా రద్దు చేసేందుకు వ్యవసాయ మోటార్ లకు స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. మీటర్లు ప్రతిపాదన మానుకోకుంటే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా భావించాల్సి వస్తుందని అన్నారు. సత్వరం చార్జీలు తగ్గించాలని, మీటర్లు ప్రతిపాదన మానుకోవాలని లేనిచో రాబోయే ఎన్నికల లో తగు గుణం పాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, మున్నా, రామచంద్ర, వెంకటేష్, మంజు, రామన్న, మణి, బాబు, రమణ, జోసెఫ్, సుధాకర్, సూరి, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.










