- వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఏకం కావాలి
- ప్రాంతీయ పార్టీలది ప్రధాన భూమిక
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : దేశాన్ని అధోగతి పాల్జేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా వామపక్ష ప్రజతంత్ర పార్టీలు, లౌకికశక్తులు ఐక్యం కావాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా కోరారు. ఈ నెల 14 నుండి విజయవాడలో జరగనున్న సిపిఐ అఖిలభారత మహాసభలో పాల్గనడానికి బుధవారం ఆయన నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిజెపిని గద్దెదించడంలో ప్రాంతీయ పార్టీలు ప్రధాన భూమిక పోషించాలని కోరారు. దేశ రాజకీయాలను మార్చడం, బిజెపికి ప్రత్యామ్నాయం చూపడమే ప్రధాన అజెండాగా మహాసభలో చర్చించనున్నట్లు చెప్పారు. మహాసభలకు దేశ, విదేశీ ప్రతినిధులతోపాటు వామపక్ష పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామన్నారు. మహాసభ విజయవంతానికి పార్టీ జాతీయ కార్యదర్శి, ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ కె.నారాయణ, పార్టీ కార్యదర్శి, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ నేతృత్వంలో విశేష కృషి చేశారని, కార్యకర్తలూ అహర్నిశలూ పనిచేస్తున్నారని అభినందించారు. సిపిఐ 1925లో ఏర్పడిందని, అప్పటి నుంచి గత 97 సంవత్సరాలుగా లౌకిక వాదం, సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ పరిరక్షణ నినాదంతో ప్రజల తరపున రాజీలేనిపోరాటాలను నిర్వహిస్తోందన్నారు. మోడీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ, బహుళజాతి కంపెనీలకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందన్నారు. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని, కొన్ని పార్టీలు బిజెపికి మద్దతిస్తున్నాయని పేర్కొంటూ ఆ పార్టీలు తమ వైఖరిని పునరాలోచించుకోవాలని కోరారు. అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి బిజెపిని గద్దె దించడంలో భాగస్వాములు కావాలన్నారు. కొత్తగా పార్టీలు పెట్టుకునే హక్కు అందరికీ ఉందని భారతీయ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) పార్టీ విధి విధానాలను పరిశీలిస్తున్నామని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. జాతీయ మహాసభల్లో పాల్గనేందుకు 17 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారని జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు పల్లవ్‌సేన్ గుప్తా తెలిపారు. రష్యా, చైనా, బంగ్లాదేశ్, క్యూబా, గ్రీస్, ఫ్రాన్స్, టర్కీ, పోర్చుగ్రీస్, నేపాల్, బ్రిటన్ తదితర దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అతుల్‌కుమార్ అంజన్ మాట్లాడుతూ ఈ మహాసభలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతోపాటు భవిష్యత్తు పోరాటాలను రూపొందించుకుంటామన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణరాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గన్నారు.










