May 18,2023 10:00
  • రెండేళ్లుగా రైతుల ఎదురుచూపు
  • రీలర్లకు అదేపరిస్థితి
  • బకాయిల చెల్లింపులో జాప్యం

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా సత్యసాయి జిల్లాలో మల్బీరీ సాగవుతోంది. పట్టు ఉత్పత్తి కూడా అధికమనే చెప్పాలి. అయితే ప్రభుత్వం పట్టు రైతులకు, పట్టు ద్వారా దారం తీసే రీలర్లకు అందివ్వాల్సిన ప్రోత్సహకాల్లో తీరని జాప్యం జరుగుతోంది. సత్యసాయి జిల్లా పరిధిలో 50,016 ఎకరాల్లో మల్బరీ సాగవుతుంది. మార్కెటింగ్‌ సౌకర్యం కూడా ఈ జిల్లా పరిధిలోనే అధికంగా ఉంటుంది.

  • ఎస్‌డిఎస్‌ కోసం పట్టు రైతుల ఎదురుచూపు

పట్టుగూళ్లు ఉత్పత్తి చేసి విక్రయించే సమయంలో ధర తక్కువగా ఉంటే కిలోకు రూ.50 చొప్పున రైతులకు ప్రోత్సహం కింద ప్రభుత్వం ఎస్‌డిఎస్‌ (రాష్ట్ర అభివృద్ధి నిధి) కింద అందజేయడం జరుగుతుంది. దీని కింద 2021-22 సంవత్సరంలో రూ.7.03 కోట్లు కావాల్సి ఉండగా ప్రభుత్వం రూ.1.77 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఇందులోనూ రూ.77.50 లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. తక్కిన కోటి రూపాయలు బ్యాంకు ఖాతాల్లోకి జమవ్వలేదు. మంజూరవని మొత్తం పెండింగ్‌లోనే ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.1.70 కోట్లు కేటాయించింది. కాని నిధులు ఇప్పటికీ మంజూరు కాలేదు. రైతులు ఈ ప్రోత్సహం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.

  • రీలర్లకూ పెండింగే...

పట్టు రీలర్ల పరిస్థితి ఇలాగే ఉంది.పట్టు కోనుగోలు చేసిన రీలర్లకు ప్రోత్సహం ఎస్‌డిఎస్‌ కింద మంజూరు చేస్తారు. కాని రెండేళ్లుగా వీరి పరిస్థితి అదే తీరున ఉంటోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.1.65 కోట్లు ప్రోత్సహకం కింద మంజూరవ్వాల్సి ఉంది. ఇందులో రూ.1.54 కోట్లు మంజూరు చేసినప్పటికీ రీలర్ల ఖాతాలకు జమైంది మాత్రం రూ.36 లక్షలు మాత్రమే. ఇంకా రూ.1.18 కోట్లు జమవ్వాల్సి ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి రూ.1.85 కోట్లు మంజూరవ్వాల్సి ఉంది. కాని ఇప్పటి వరకు ఒక్క రూపాయి జమవలేదు. వీటి కోసం రీలర్లు ఎదురు చూస్తూనే ఉన్నారు.

  • నాలుగేళ్లుగా బకాయిలున్నాయి

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగేళ్లుగా పట్టు రైతులు, రీలర్లకు అందాల్సిన ప్రోత్సహకాలు అందలేదు. సుమారు రూ.50 కోట్ల వరకు బకాయిలున్నాయి. వీటిని చెల్లించాలని అనేక మార్లు ప్రభుత్వానికి విన్నవించాం. ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డిని కూడా పట్టు రైతులు కలసి సమస్యను విన్నవించారు. బకాయిలను చెల్లిస్తామని ఆయన హామీనిచ్చారు. ఇంకా మంజూరవ్వలేదు. ఇప్పటికైనా బకాయిలను విడుదల చేయాలి. అదే సమయంలో ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ చేపడతామని చెబుతోంది. అందులో భాగంగా పట్టు పరిశ్రమ శాఖ కమిషనరేట్‌ను హిందూపురంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మల్బరీసాగు సత్యసాయి, మదనపల్లి ప్రాంతాల్లోనే అధికంగా ఉంది. ఈ ప్రాంతానికి అనువుగా ఇక్కడ ఏర్పాటు చేస్తే పట్టు రైతులకు ఉపయోగంగా ఉంటుంది.

- వెంకటరామిరెడ్డి, ఎపి పట్టు రైతు సంఘం రాష్ట్ర నాయకులు.