Nov 10,2022 07:46
  •  ఇతర తెగుళ్లూ విజృంభణ
  • లక్షల ఎకరాలపై దాడి
  • పంట నష్టం అపారం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఈ ఏడాది సైతం పత్తి పంటపై తెగుళ్లు దాడి చేస్తున్నాయి. పత్తిని సర్వనాశనం చేసే గులాబీ పురుగు వేలాది ఎకరాల్లో వ్యాపించింది. గులాబీతో పాటు పూత రాలిపోవడం, వేరుకుళ్లు వంటివీ పంటను ఆశిస్తున్నాయి. ఇప్పటికే రెండు లక్షల ఎకరాలకుపైన పత్తి పంట తెగుళ్లబారిన పడిందని వ్యవసాయశాఖ చెబుతోంది. పురుగు వ్యాపించే తీవ్రత తక్కువగానే ఉందని, గుర్తించి రైతులను అప్రమత్తం చేసి నివారణా చర్యలను సూచిస్తున్నామని వెల్లడించింది. కాగా రైతులు మాత్రం తెగుళ్లపై ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ లెక్కల కంటే రెండు మూడు రెట్ల విస్తీర్ణానికి తెగుళ్లు వ్యాపించాయని, పంట నష్టం గణనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోకితే చేతికి రాదు
నిరుడు ఖరీఫ్‌లో భారీ వర్షాల వలన పత్తి పంట దెబ్బతింది. దిగుబడి తగ్గింది. నవ్యాంధ్ర ఏర్పడ్డాక గతేడాదే అతి తక్కువగా ఎకరానికి సగటున 4.7 క్వింటాళ్ల ఉత్పాదకత లభించింది. ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్‌లో కొంత రేటు వచ్చింది. దాంతో ఈ మారు ఖరీఫ్‌ రైతులు పత్తి వైపు మళ్లారు. టార్గెట్‌లను, సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించి 16.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అయితే భారీ వర్షాలు, వర్షాభావం, డ్రై-స్పెల్స్‌ కారణంగా ఉత్పాదకత తగ్గుతుందని, ఎకరానికి ఆరు క్వింటాళ్లు లభిస్తాయని అంచనా వేశారు. ఇదిలా ఉండగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన పత్తిపై వివిధ రకాల తెగుళ్లు విరుచుకుపడ్డాయి. గులాబీ తెగులు అత్యంత ప్రమాదకరమైంది. ఆదిలోనే గుర్తించి సస్యరక్షణా చర్యలు చేపట్టి నివారించకపోతే అంతే సంగతులు. పంట చేతికి రాదు. ఈ తెగులు అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. పత్తి అధికంగా సాగైన కర్నూలు, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో గులాబీ తెగులు ప్రభావం అధికంగా ఉందని చెబుతున్నారు. ఈ జిల్లాల్లో అన్ని తెగుళ్లూ కలిపి 2.13 లక్షల ఎకరాల్లో వ్యాపించాయని తెలపగా, అత్యధికభాగం గులాబీ తెగులేనని తెలుస్తోంది. పత్తి ఎక్కువగా సాగైన ఎన్‌టిఆర్‌, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో సైతం గులాబీతో పాటు ఇతర తెగుళ్ల ప్రభావం ఉంది.
ఏది కారణం...
2014-15, 2015-16 ఖరీఫ్‌లలో గులాబీ తెగులు వలన పత్తికి జరిగిన నష్టం అంతాఇంతా కాదు. బిటి-2 విత్తనాలు కేవలం శనగపచ్చ పురుగును మాత్రమే ఎదుర్కొంటాయి తప్ప గులాబీ వంటి ఇతర తెగుళ్లను కాదు. ఆ అనుభవంతో రైతులు ఒకటి రెండేళ్లపాటు పత్తి జోలికి అంతగా పోలేదు. మళ్లీ రెండేళ్ల నుంచి పత్తి వైపు మళ్లుతున్నారు. ఇదిలా ఉండగా, అనుమతుల్లేని బిటి-3 తో పాటు నకిలీ, కల్తీ, నాసిరకం విత్తనాల వలన పత్తికి తెగుళ్లు వ్యాపిస్తున్నాయని ఆరోపణలొస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం భారీ వర్షాలు, వర్షాభావం, డ్రై-స్పెల్స్‌ కట్టకట్టుకొని ఒకేసారి రావడం మూలంగా పత్తిపై తెగుళ్లు విరుచుకుపడి పంటను దెబ్బతీస్తున్నాయని, పంట నష్టం, దిగుబడి నష్టం, నాణ్యతాలోపం చోటు చేసుకుంటోందని, రైతులకు నష్టాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.