
ప్రజాశక్తి-సి.బెళగల్ (కర్నూలు) : మండలంలోని నది తీరం వెంట గ్రామాల రోడ్లు దుర్భర స్థితికి చేరాయి. ఇక్కడే ఆర్టీసీ బస్సులకు, ఇతర వాహనదారులకు గ్రహపాట్లు వెన్నాడుతున్నాయి. మంగళవారం విద్యార్థి బస్సు ఎదురుగా వస్తున్న ఆటోకు దారి ఇవ్వబోయి పక్కకు వెళ్లి బురద గుంతలో ఇరుక్కుపోయింది. ఆ వెంటనే తిమ్మందొడ్డికి వెళుతున్న బస్సు ఎలాగో దారి ఉంది కదా అని విద్యార్ధి బస్సు దాటబోయి పక్కన పైప్లైన్ గుంతలో ఇరుక్కొని పోయింది. ఇలా రెండు బస్సులు ఒకే చోట ఇరుక్కుపోవడంతో ' ఇలానే ఉండి పోదాం ' అన్నట్లుగా దర్శనమిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు చాలాసార్లు మరమ్మతులకు గురవుతున్న బస్సులతో బడులకు వేళకు వెళ్లలేని స్థితి నెలకొంది. విచిత్రమేమిటంటే ఈ బస్సులు ఇరుకున్న కొద్దీ దూరంలోనే గుండ్రేవులకు వస్తున్న మరో బస్సు రోడ్ల దుస్థితి ఫలితం మరమ్మతులకు గురైంది. ఆ రోడ్డులో ఉన్నవే మూడు బస్సులు ఒకే రోజు ఒకే వేళలో కదలని పరిస్థితిలో ఉండటం ప్రయాణికులకు, వాహనదారులకు, విద్యార్థులకు ఇక్కట్లు తప్పలేదు. రోడ్ల దుస్థితిపై చాలాసార్లు విన్నవించినా పాలకవర్గం, అధికారవర్గం పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.