
ప్రజాశక్తి - ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండలవ్యాప్తంగా హొమహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వలసల నిర్మూలనతోపాటు పేదలకు పని భద్రత కల్పించాలన్న లక్ష్యంతో ఉపాధి హామీ పనులకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. కానీ నేడు ఉపాధి హామీ పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అపహాస్యం చేస్తున్నాయి. ఇప్పటికే ఉపాధి నిధులను ఏటా కోత విధిస్తున్న కేంద్రం.. వేసవి ఎండలో పనిచేసే కూలీలకు అందాల్సిన వేసవి రాయితీలను కూడా కోత పెట్టింది. చివరికి పని ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యాన్ని కూడా లేకుండా చేసింది. ఆత్మకూరు మండలంలో 17 పంచాయతీలకు గానూ, 12,500 జాబ్‌కార్డుల ద్వారా సుమారుగా 25 వేల మంది వరకు కూలీలు ఉపాధి పనులకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాది 5,40,678 పనిదినాలు నమోదు చేసి, 725 కుటుంబాలకు మాత్రమే 100 రోజులు పని కల్పించారు. దీంతో ఈ ఏడాది 7.5 లక్షల పని దినాలు పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. గత ఏడాది సరాసరి వేతనంగా ప్రభుత్వం రూ.257కు రూ.231 వేతనం కూలీలకు నమోదు చేసింది. కానీ ఈ ఏడాది వేసవి ఎండలకు కూలీలు పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది.
కానరాని టెంట్లు
ఉపాధి పనులు చేయాలంటే గ్రామాలకు దూర ప్రాంతాల్లో ఉన్న చెరువులకు, వంకలకు చేరుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించిన వేతనం నమోదు కావాలంటే కూలీలు రెండు పూటలా పనులు చేయాలని అధికారులు చెబుతున్నారు. ఉదయం ఆరు గంటలకు బయలుదేరి పని ప్రదేశాలను వెళ్లడానికి కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి. తీరా అంత దూరం నడిచాక, ఎండలో అక్కడ నిలువ నీడ లేకపోవడంతో కూలీలు వడదెబ్బ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం గానీ, అధికారులు గానీ టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. కనీసం తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారని కూలీలు తెలుపుతున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నంత అధికారులు స్పందించి అన్ని సౌకర్యాలు కల్పించేలా చూడాలని కూలీలు తెలియజేస్తున్నారు.