Dec 22,2022 06:42

నాసిరకం పత్తి విత్తనాల వల్ల రాష్ట్రంలో ఈ సంవత్సరం రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో ఈ నష్టం మరింత ఎక్కువగా వుంది. పంట పెట్టుబడిలో కోట్ల రూపాయలు నష్టపోయిన రైతులు రోడ్లు ఎక్కుతున్నారు. నాసిరకం విత్తనాలను సరఫరా చేసిన కంపెనీల మీద చర్య తీసుకోవాలని, తమకు పరిహారం ఇప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పత్తి రైతుల నష్టం మీద తగినంత శ్రద్ధ పెట్టడంలేదు. రైతులు ఆందోళన చేసిన చోట వ్యవసాయ శాఖ నిపుణుల ద్వారా పరిశీలన జరిపి నష్టానికి మూల కారణాలను గుర్తించడంలేదు. పత్తి పంట గత నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు ఏ మాత్రం సాగు కాని ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో గత రెండు సంవత్సరాల్లో భారీగా సాగు పెరిగింది. ఈ పెరుగుదలకు అనుగుణంగా విత్తనాలు, పురుగుమందులు, ప్రభుత్వ రుణ సహాయం, మార్కెటింగ్‌ సదుపాయం, వ్యవసాయ శాస్త్రవేత్తల నియామకం లాంటి అవసరమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవడంలేదు. దీనివల్ల విత్తన, పురుగు మందుల కంపెనీల ఊబిలో ఇరుక్కున్న రైతులు విలవిలలాడుతున్నారు.

  • పెరుగుతున్న పత్తి సాగు

ప్రస్తుతం దేశంలో పత్తి పంట సాగుపై 60 లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా...వాణిజ్యం, ప్రాసెసింగ్‌ లాంటి పరోక్ష పద్ధతుల్లో మరో నాలుగున్నర కోట్ల మంది ప్రజలు ఆధారపడి వున్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం క్రమంగా పెరిగింది. నీటి పారుదల అవకాశాలు వున్న ప్రాంతాల్లోనే కాక మెట్ట ప్రాంతాల్లో సైతం పత్తి సాగు పెరుగుతూ వస్తున్నది. రాష్ట్రంలో సాధారణ సాగు 15.37 లక్షల ఎకరాలు. 2021లో 1.82 లక్షల ఎకరాల్లో అదనంగా సాగు కాగా, ఈ సంవత్సరం ఏకంగా 3.82 లక్షల ఎకరాల సాగు అదనంగా పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో సాగవుతుంది. ఈ సంవత్సరం సాగు పెరుగుదల రాయలసీమ జిల్లాలో అధికంగా వుంది. కడప జిల్లాలో 151 శాతం, అనంతపురం 57 శాతం, నంద్యాల 37 శాతం, ప్రకాశం జిల్లాలో 40 శాతం అదనంగా పెరిగింది.
అనంతపురం జిల్లా పంటల సాగులో వచ్చిన మార్పులను పరిశీలిస్తే ఈ ధోరణికి కారణాలు అర్థమవుతాయి. జిల్లాలో మొత్తం సాగు భూమి 24 లక్షల 12 వేల 500 ఎకరాలు కాగా 2007లో 21 లక్షల 87 వేల ఎకరాల్లో వేరుశనగ పంట సాగైంది. రాష్ట్రంలోనే అత్యధికమిది. అయితే 2021 నాటికి 11 లక్షల 85 వేల ఎకరాల్లో (అంటే 10 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు తగ్గింది), ఈ సంవత్సరం కేవలం 4 లక్షల 41 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. అంటే గత 15 సంవత్సరాల్లో సుమారు 22 లక్షల ఎకరాల నుండి 4 లక్షల ఎకరాల సాగుకు వేరుశనగ పంట కుదించబడింది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సు ప్రకారం హెక్టారుకు 1200 కేజీల వేరుశనగ దిగుబడి వస్తే రైతుకు గిట్టుబాటు అవుతుంది. అయితే గత 26 సంవత్సరాల దిగుబడి పరిశీలిస్తే 21 సంవత్సరాల సగటు 75 కేజీల నుంచి 711 కేజీల వరకు మాత్రమే వచ్చింది. గడచిన 19 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు జిల్లాలోని (ఉమ్మడి జిల్లా) 63 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. ఈ కరువులకు ప్రధాన కారణం వర్షాభావం. సాధారణంగా పంటలు సాగు చేయడానికి 750 మి.మీ కావాలని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. గత 26 సంవత్సరాలను గమనిస్తే కేవలం 6 సంవత్సరాలు మాత్రమే 700 మి.మీటర్లకు మించి వర్షం వచ్చింది. అంటే 20 సంవత్సరాలు పంటలు పండే వర్షాలు రాలేదు. వీటికి తోడు ఎరువులు, పురుగుమందులు, పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగిన వేరుశనగ ధర మాత్రం గత 20 సంవత్సరాల నాడు ఉన్న ధరకు కొద్దిగా అటుఇటుగా వుంది. ఈ కారణాలన్నిటి వల్ల వేరుశనగ సాగు జిల్లాలో గణనీయంగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితే రాయలసీమ లోని అన్ని జిల్లాలో వుంది. కర్నూలులో వరుసగా నష్టాల పాలవుతున్న ఉల్లి పంట ఇలాగే సాగు తగ్గిపోతున్నది.

  • పత్తి పంట వైపు రైతులు ఎందుకు మళ్ళారు?

పత్తి దిగుబడి గత రెండు సంవత్సరాల్లో సాధారణంగా ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్ళు వచ్చింది. గతం నుండి సాగుచేస్తున్న వేరుశనగ పంట వరుస నష్టాలు, పత్తి దిగుబడి పెరగడం, ధర గిట్టుబాటు కావడంతో రైతులు పత్తి పంటవైపు మళ్ళారు. కొన్ని ప్రాంతాల్లో విత్తన కంపెనీలు, ఫెర్టిలైజర్‌ షాపు యజమానులు పత్తి సాగుకు అప్పులు ఇస్తున్నారు. పంటకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులతో పాటు, కొంత మొత్తం నగదు రూపంలో అప్పులు ఇచ్చి పంట మొత్తాన్ని వారే ముందస్తు ధరతో పంట కొనుగోలు చేస్తున్నారు. బ్యాంకుల్లో పేద, మధ్యతరగతి రైతులకు అప్పులు ఇవ్వడం తగ్గిపోయింది. ప్రైవేట్‌ అప్పులు ఇవ్వడంలో కంపెనీలు లేదా ఫెర్టిలైజర్‌ షాపులు రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలు అయ్యాయి. ఇది కూడా పత్తి పంట సాగుకు మరో కారణంగా వుంది. రైతుకు అవసరమైన సలహాలు, సూచనలు చేసే అధికార వ్యవస్థ పూర్తిగా బలహీనపడింది. ఈ స్థానంలో కంపెనీల ప్రతినిధులు పొలాల్లో తిరుగుతూ విత్తనం దశ నుండి పంట సాగు వరకు అన్ని సలహాలు ఇస్తున్నారు. వీరి అర్హత ఏమిటీ? వీరు ఇచ్చే సలహాల్లో నిజానిజాలు ఏమిటీ? పరిశీలించే అధికార యంత్రాంగం లేదు. దీంతో రైతులకు కంపెనీల ప్రతినిధులే దిక్కయ్యారు.

  • కంపెనీల మోసాలు

పత్తి విత్తనాల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా 400కు పైగా విత్తన కంపెనీలు విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్‌, గ్రేడింగ్‌ చేపడుతున్నాయి. దేశానికి అవసరమైన పత్తి విత్తనాల్లో 60 శాతం తెలంగాణ రాష్ట్రం నుండే సాగు అవుతుంది. ఈ సంవత్సరం సాధారణ సాగు కంటే పత్తి సాగు అధికంగా పెరగడంతో కంపెనీల దగ్గర వున్న విత్తనాల్లో నాసిరకం వాటిని కలిపి దోపిడి తీవ్రం చేశారు. సాధారణంగా 90 శాతం బి.టి విత్తనాల్లో పది శాతం బి.టి కాని విత్తనాలు కలుపుతారు. వీటివల్ల పత్తి దిగుబడి పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతారు. గతంలో 450 గ్రాముల పత్తివిత్తనాల ప్యాకెట్‌లో 45 గ్రాముల నాన్‌ బి.టి విత్తనాలు ప్రత్యేక ప్యాకెట్‌లో ఇచ్చేవారు. వీటిని అక్కిల్లలో (హద్దుల్లో) రైతులు వేసేవారు. కాని విధానం మారిందనే సాకుతో విత్తన ప్యాకెట్లలోనే నాన్‌ బి.టి విత్తనాలు కలపడం గత రెండు సంవత్సరాల్లో పెరిగింది. దీంతో నాణ్యమైన విత్తనాలు ఏవో, నాసిరకం ఏవో కనిపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. విత్తన కంపెనీల నుండి వ్యాపారస్తుల దగ్గరకు వచ్చిన ప్రతి లాట్‌ను వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేసి వాటి నాణ్యతను నిర్ధారించిన తర్వాతే అమ్మకాలు చేయాలని చట్టంలో వున్నప్పటికి ఎక్కడా అమలు కావడంలేదు. ప్రభుత్వ రంగ విత్తన సంస్థలు ఉన్ననాడు రూపొందించుకున్న 1968 విత్తన చట్టమే నేటికి అమలవుతుంది. ప్రైవేట్‌ కంపెనీలు లాభాల కోసం విత్తనాలు సరఫరా చేస్తారని తెలిసి చట్టాలను మార్చడం కాని, నాసిరకం విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవ డానికి అవసరమైన విధానాలు రూపొందించక పోవడం వెనుక కంపెనీల హస్తం ఎంత బలంగా వుందో అర్థమవు తుంది.
పంట సక్రమంగా రావాలంటే ఫెర్టిలైజర్‌ కంపెనీలు రకరకాల మందులు ఇచ్చి రైతులను అప్పుల ఊబిలో దించుతున్నాయి. పత్తి పంటకు కనీసం 12 సార్లు మందులు కొడుతున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 50 శాతం పైగా జిల్లాలో పురుగుమందులు అమ్ముడుపోయాయి. ఒక ఎకరాకు కనీసం రూ. 50 వేల ఖర్చు అవుతుంది. విత్తనాల నాసిరకంపై, పురుగు మందుల వాడకంపై కనీసం విచారించే అధికార యంత్రాంగం జిల్లాల్లో లేదు. పంట నష్టం జరిగిందని రోడ్లపైకి రైతులు వచ్చి ఆందోళ చేస్తే నంద్యాల నుండి శాస్త్రవేత్తలు వస్తున్నారు. వారు తనిఖీ చేసిన నివేదిక బహిర్గతం కాదు. ఒకవేళ ప్రకటిస్తే ప్రకృతి కారణాలు చూపుతున్నారే కాని విత్తన కంపెనీల గురించి ఒక్క మాట మాట్లాడడంలేదు. ఎవరైనా అధికారి నిజాయితీగా వాస్తవాన్ని ప్రకటిస్తే వారిపై వేధింపులు, బదిలీలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

  • ప్రభుత్వాల బాధ్యత

కార్పొరేట్‌ ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు పరస్పరం భిన్నమైనవి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ హయాంలో ఒకవైపు కార్పొరేట్‌ కంపెనీల సంపద భారీగా పెరుగుతుంటే, మరోవైపు రైతులు, శ్రమజీవులు అప్పుల ఊబిలో కూరుకుపోయి పేదరికంలోకి వేగంగా జారిపోతున్నారు. నాశిరకం విత్తనాలు, పురుగు మందులు తయారు చేస్తున్న కంపెనీలను అరికట్టడానికి ప్రభుత్వ తనిఖీ విభాగాలు పని చేయడంలేదు. రాష్ట్రంలో తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసిపి పంట నష్టానికి కారణమైన కంపెనీల మీద చర్యలు తీసుకోవడం కాకుండా పంట నష్టానికి కొద్ది మొత్తంలో పరిహారం ఇచ్చి రైతులను ఆదుకుంటున్నట్లు ప్రచారం చేసుకుంటున్నది. రైతులు సాగు చేసేది పరిహారం కోసం కాదనే విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలి. రైతు అనుకూల విధానాల కోసం, కంపెనీల దోపిడికి వ్యతిరేకంగా రైతాంగం ఐక్య ఉద్యమాలు చేపట్టాలి.

problems-of-cotton-farmers-in-ap-seeds-article-by-rambhupal

 

 

 

/ వ్యాసకర్త : వి.రాంభూపాల్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు/