Sep 27,2023 17:31

న్యూఢిల్లీ :   అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌లోని కొన్ని ప్రాంతాలలో వివాదాస్పద సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం 'ఎఎఫ్‌ఎస్‌పిఎ' ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. సైనికులకు ప్రత్యేక అధికారాలు కల్పించే ఎఎఫ్‌ఎస్‌పిఎ యాక్ట్‌ 1958, సెక్షన్‌ 3 ప్రకారం అక్టోబర్‌ 1 నుండి మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంగళవారం ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం ఎనిమిది జిల్లాలతో పాటు నాగాలాండ్‌లోని మరో ఐదు జిల్లాల్లో 21 పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చట్టం అమలులో ఉండనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఈ ఏడాది మార్చి 24న ఆరు నెలల పాటు ఈ వివాదాస్పద చట్టం అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతరాయం కలిగించే ప్రాంతాలుగా పేర్కొంటూ కేంద్రం పలు రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని పొడిగిస్తున్న సంగతి తెలిసిందే. అంతరాయం కలిగించే ప్రాంతాలలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ చట్టం భారత సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలను మంజూరు చేస్తుంది. భద్రతా సిబ్బంది ఎటువంటి వారెంటు లేకుండా సోదాలు, అరెస్టులు చేయవచ్చు. విచారణ, చట్టపరమైన కేసులకు భయపడ కుండా చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చంపే అధికారాలను కూడా కట్టబెట్టింది. దీంతో ఈ చట్టాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.