Sep 13,2023 10:44

కోహిమా : ఏక రూప పౌరస్మృతి (యుసిసి)ని నాగాలాండ్‌లోని అన్ని పార్టీలూ వ్యతిరేకించాయి. దీనిపై శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించాలని నిర్ణయించాయి. నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌కు చెందిన కుజోలిజో నైనూ శాసనసభలో సోమవారం దీనిపై చర్చను ప్రారంభించారు. భిన్న సంప్రదాయాలు, సంస్కృతులకు నెలవైన భారతదేశంలో ఇలాంటి చట్టాన్ని తీసుకురావడం నిష్ప్రయోజనమని, పైగా అది ప్రతికూల ఫలితాన్ని ఇస్తుందని తెలిపారు. ఒకవేళ పార్లమెంటు యుసిసిని ఆమోదిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371 (ఎ) కింద నాగాలాం డ్‌కు మినహాయింపు లభిస్తుందని ఆయన గుర్తు చేశారు.
నాగాల మత, సామాజిక పద్ధతులకు సంబంధించిన వ్యవహారాలకు పార్లమెంట్‌ చట్టాలు వర్తించబోవని స్పష్టం చేశారు. బెంగాల్‌ ఈస్ట్రన్‌ ఫ్రాంటియర్‌ రెగ్యులేషన్‌ చట్టం మేరకు యుసిసి నుంచి నాగాలాండ్‌ను మినహాయించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి నైఫియూ రియో చెప్పారు. ఈ చట్టం ప్రకారం నాగాలాండ్‌కు న్యాయ, కార్యనిర్వాహక, పరిపాలనా సంబంధమైన అధికారాలు సంక్రమించాయని, భూ సంబంధమైన విషయాలలో స్వయం నిర్ణయాధికారం కూడా ఉన్నదని వివరించారు.