Apr 15,2023 21:23
  • 14మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న నాగాలాండ్‌ కాల్పులపై కేంద్రం వైఖరి

న్యూఢిల్లీ : నాగాలాండ్‌లో తీవ్రవాద వ్యతిరేక చర్యలు బెడిసికొట్టి 14మంది యువకుల మరణానికి దారితీసిన ఘటనలో 30మంది సైనికులను ప్రాసిక్యూట్‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని స్థానిక మీడియా తెలిపింది. 2021 డిసెంబరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో నిందితులైన 30మందిపై దర్యాప్తు చేపట్టడానికి రక్షణ శాఖ, మిలటరీ వ్యవహారాల విభాగం, భారత ప్రభుత్వం అనుమతిని తిరస్కరించాయని నాగాలాండ్‌లో పోలీసుల ప్రకటనను ఉటంకిస్తూ ఎన్‌డి టివి పేర్కొంది. నాగాలాండ్‌లోని మాన్‌ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల ఘటనపై దర్యాప్తు జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన చార్జిషీట్‌లో భారత సైనికుల పేర్లు నిందితులుగా పేర్కొంది. రక్షణ మంత్రిత్వశాఖ అనుమతి నిరాకరణను స్థానిక కోర్టుకు తెలియజేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో 14మంది పౌరులు, ఒక సైనికుడు మరణించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవనె మాట్లాడుతూ, బాధ్యులైన సైనికులపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.