Feb 16,2023 08:04
  •  2007లో మొదలైన పనులు
  •  15 ఏళ్లుగడుస్తున్నా ఎక్కడి పనులు అక్కడే

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : 15 ఏళ్ల క్రితం ప్రారంభమైన వంశధార, నాగావళి కరకట్టల నిర్మాణ పనులు నేటికీ ఒక కొలిక్కి రాలేదు. అధికార మార్పిడి జరుగుతున్న ప్రతి సందర్భంలోనూ నిర్మాణ సంస్థలు మారడటంతో కరకట్టల కథ మళ్లీ మొదటికే వస్తోంది. 2007లో కాంగ్రెస్‌ పార్టీ హయాంలో మొదలైన పనులు ఏ దశలో నిలిచిపోయాయో అదే స్థితిలో ఉన్నాయి. టిడిపి ప్రభుత్వం కొత్త నిర్మాణ సంస్థలకు పనులు అప్పగించడం, అంచనా వ్యయం పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతోనే సరిపెట్టింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం తొలుత వరద ముప్పు తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించింది. ప్రభుత్వ సూచనలకనుగుణంగా 2021 మేలో అధికారులు ప్రతిపాదనలు పంపినా నేటికీ ఆమోదం తెలపలేదు. వేసవి నేపథ్యంలో పనులు చేపట్టేందుకు అనువైన కాలం కావడంతో ప్రభుత్వం అనుమతి కోసం అధికారులు వేచిచూస్తున్నారు.
వంశధార నదిపై నిర్మించాల్సిన కరకట్టలను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి ప్యాకేజీ పనిని 2007 ప్రారంభంలో రూ.44.77కోట్లతో ప్రారంభించారు. 2010 జూన్‌ నాటికి సంబంధిత నిర్మాణ సంస్థ ఏడు శాతం మాత్రమే పనిచేసి నిలుపుదల చేసింది. ప్యాకేజీ-2 పనులను అదే సంస్థ రూ.27.29 కోట్లతో పనులను దక్కించుకుంది. పనులను 2007లో ప్రారంభించి, 2011 మార్చి నాటికి 5.66 శాతం పనులను పూర్తి చేసి మిగిలిన పనిని చేయలేమంటూ చేతులెత్తేసింది. ప్యాకేజీ-3 పనులను కూడా 2007 ప్రారంభంలో రూ.49.16 కోట్లతో ప్రారంభించారు. 2010 జులై నాటికి 2.45శాతం పనులు పూర్తి చేసి, అర్ధాంతరంగా విడిచిపెట్టేసింది. మూడు ప్యాకేజీలకు ఒకే నిర్మాణ సంస్థ పని దక్కించుకోగా, ప్యాకేజీ-4 పనులను వేరే నిర్మాణ సంస్థ చేజిక్కుంచుకుంది. 2009లో రూ.56.60 కోట్లకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ 21.34 శాతం పనులు పూర్తి చేసి అర్ధాంతరంగా విడిచిపెట్టేసింది. ఆయా నిర్మాణ సంస్థలు ఎంత మేర పనులు చేసి ఆపేశాయో అక్కడ నుంచి నేటి వరకు అదనంగా ఒక్క శాతం పనులు కూడా జరగలేదు. కరకట్టల నిర్మాణానికి పెద్ద ఎత్తున భూమిని సేకరించాల్సి ఉండటం, భూసేకరణకు అధికంగా నిధులు వెచ్చించాల్సి రావడంతో ప్రభుత్వం ఉన్న పళంగా కరకట్టలను ఆపేసింది.

  • నాగావళి కరకట్టల పనులూ నిలిపివేత

నాగావళి నదిపై నిర్మిస్తున్న కరకట్టలు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో నిర్మిస్తున్న కరకట్టలను ప్యాకేజీగా పనులుగా చేపడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్‌ సంస్థ రూ.61.45 కోట్లకు పనులను దక్కించుకుంది. 2008లోనే పనులను ప్రారంభించింది. ఇప్పటికి కూడా పనుల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. జిల్లా పరిధిలో 51.88 కిలోమీటర్ల మేర వరద కట్ట నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 17.29 కి||మీ పొడవు మేర మాత్రమే పని పూర్తయింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 25 శాతం కంటే తక్కువ ఖర్చు చేసి పనులను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ మే 29, 2019న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అధికారులు ఎక్కడి పనులను అక్కడే నిలిపేశారు.

  • ప్రాధాన్యతా పనులకూ ఆమోదం తెలపని ప్రభుత్వం

వంశధార, నాగావళి నదుల వరదల నుంచి అధిగమించడానికి గతంలో కరకట్టల పనులను ప్రారంభించినా ఫలితం లేకపోయింది. 2009-10 మధ్య కాలం వరకు కాస్తాకూస్తో పనులు జరిగినా ఆ తర్వాత నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం 25శాతంలోపు ఖర్చయిన పనులను నిలిపేసి వరద ముప్పు తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలంటూ అధికారులను ఆదేశించింది. ముంపు తీవ్రత అధికంగా ప్రాంతాలను గుర్తించి అందులో ముఖ్యమైన పనులకు ప్రాధాన్యమివ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలతో నాగావళి కరకట్టలకు సంబంధించి అధికారులు తొలుత ఐదు ప్రాంతాలను గుర్తించారు. వాటిలో కరకట్టల నిర్మాణానికి రూ.119 కోట్లు అవసరం అవుతాయని అధికారులు ప్రాతిపాదించారు. అదే విధంగా వంశధారపై 22.77 కి.మీ మేర కరకట్టలను నిర్మించేందుకు రూ.126 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నాగవాళి, వంశధార నదులపై వరద ముంపు తీవ్రంగా ఉన్న ప్రాంతాలపై ప్రతిపాదనలు పంపి ఏడాదన్నర గడుస్తున్నా ప్రభుత్వం నేటికీ ఆమోదం తెలపలేదు.