ప్రజాశక్తి - విజయవాడ :ఎగువన కురుస్తున్న వర్షాలకు గురువారం కృష్ణా నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి నీటిని సముద్రంలోకి జలవనరుల శాఖ అధికారులు విడుదల చేశారు. బ్యారేజీకి ఎగువన ఉన్న మునేరు, కట్టలేరు, వైరా ఏరు తదితర వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్‌ఫ్లో 21,306 క్యూసెక్కులుగా ఉంది. దీంతో, బ్యారేజీకి చెందిన 15 గేట్లను అడుగు మేర పైకి ఎత్తి 11,130 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. కాల్వలకు 10,176 క్యూసెక్కులు విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు బ్యారేజీ వద్ద వరద నీరు మరింత పెరిగింది. ఇన్‌ఫ్లో 22,756 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో బ్యారేజీకి చెందిన 17 గేట్లను అడుగు మేర పైకి ఎత్తి 12,580 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాల్వలకు 10,176 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజి వద్ద నీటి మట్టం 12 అడుగులుగా ఉంది.