Aug 21,2023 21:43
  • భద్రాచలం వద్ద 25 అడుగుల నీటిమట్టం
  • ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ నుంచి 2.2 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : గోదావరికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంతో పాటూ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మళ్లీ గోదావరికి వరద తాకిడి తగిలింది. భద్రాచలం వద్ద సోమవారం నాటికి 25.10 అడుగుల నీటిమట్టం నమోదైంది. దేవిపట్నంలోని గండి పోశమ్మ ఆలయంలోకి వరద నీరు నిల్చే ఉండడంతో రెండో రోజూ యాత్రికుల రాకపోకలను అధికారులు నిలిపేశారు. వరద ఉధృతి ఈ నెల 27 వరకూ ఉంటుందని సిడబ్ల్యుసి అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ వద్ద సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు 7.10 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఈ బ్యారేజీ 175 గేట్లను పైకిలేపి 2.25 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి, తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టా కాల్వలకు 11,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కొనసాగడంతో ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

రాజమండ్రిలో భారీ వర్షం

Gradually-rising-Godavari

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజమహేంద్రవరంలో కురిసిన భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కోనసీమ జిల్లా అమలాపురం, అంబాజీపేట, పి.గన్నవరం, కొత్తపేట, ఆలమూరు మండలాల్లో భారీ వర్షం పడింది. ఇటుక బట్టీల్లోకి మోకాల్లోతు నీరు చేరింది. కాకినాడ జిల్లాలో పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, పిఠాపురం, యు.కొత్తపల్లిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. యు.కొత్తపల్లిలో ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.