Aug 22,2023 21:52

-భద్రాచలం వద్ద 32 అడుగుల నీటిమట్టం
-గుండేటి, ఎద్దు వాగులు పొంగి 24 గ్రామాలకు రాకపోకలు బంద్‌
-ఆందోళనలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు
ప్రజాశక్తి- ఏలూరు, రాజమహేంద్రవరం ప్రతినిధులు:గోదావరి నదిలో నీటి ఉధృతి పెరుగుతుండడంతో ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలను మళ్లీ వరద భయం వెంటాడుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు రెండ్రోజులుగా గోదావరి వరద ఉధృతి పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో భద్రాచలం వద్ద ఆరు అడుగుల మేర ప్రవాహం పెరిగింది. సోమవారం సాయంత్రం నాటికి 26 అడుగులు ఉన్న నీటిమట్టం మంగళవారం సాయంత్రం నాటికి 32 అడుగులకు చేరుకుంది. అక్కడ నుంచి దిగువకు 3.9 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లాలోని ఎద్దువాగు, గుండేటి వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఎద్దువాగు పొంగడంతో వేలేరుపాడు మండలంలోని బోళ్లపల్లి, చిగురుమామిడి మధ్య ఉన్న కాజ్‌వేపై వరద నీరు చేరింది. దీంతో, కొయిదా, కట్కూరు, కాకిసనూరు, బోళ్లపల్లి, టేకూరు తదితర 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు, దాచారం మధ్య గుండేటి వాగుపై ఉన్న కాజ్‌వే నీట మునగడంతో బెస్తగూడెం, సీతారామపురం, నెమలిపేట, గుణ్ణంబోరు తదితర గ్రామాలకు ఈ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. ఈ గ్రామాలకు 15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వరద నీరు చేరడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం మూడు రోజులుగా ముంపులోనే ఉంది. కాటన్‌ బ్యారేజీ వద్ద ఎనిమిది అడుగుల నీటిమట్టం నమోదైంది. బ్యారేజీ 175 గేట్లను పైకిలేపి 3.6 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురవడంతో రానున్న 24 గంటల్లో మరింత ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.