Nov 09,2023 13:20

న్యూఢిల్లీ  :   ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి)ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్‌ నేతలు బుధవారం ఎలక్షన్‌ కమిషన్‌ (ఇసి)కి మెమోరాండం సమర్పించారు. ఈడిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అభిషేక్‌ సింఘ్వీ మను నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు తారిఖ్  అన్వర్‌, ఉదిత్‌ రాజ్‌లు కోరారు. ఈడి అధికారులు తమ పదవులను దుర్వినియోగం చేయడంతో పాటు ఎన్నికల మార్గదర్శకాలను ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ఈ చర్యలు ఈడి తటస్థ, నిష్పాక్షిక మరియు వివక్షతను స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌లలో కాంగ్రెస్‌ నేతలపై ఈడి ప్రతీకార చర్యలకు చేపడుతోందని పేర్కొన్నారు. ఇడిని బిజెపి రాజకీయ కక్షసాధింపు చర్యలకు వినియోగిస్తోందని పేర్కొన్నారు. రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌, రాజస్తాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ దొత్సారాల నివాసాల్లో ఈడి సోదాలు జరిపిందని, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌పై కూడా ఈడి ఆరోపణలు చేసిందని ఇసి దృష్టికి తీసుకువెళ్లారు.  మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్స్‌ భూపేష్‌ బఘేల్‌కి రూ.508 కోట్లు ఇచ్చారని ఈడి ఆరోపించిందని తెలిపారు. ఆ నగదును ఎన్నికల ఖర్చుల కోసం వినియోగిస్తోందని ఆరోపిస్తూ.. జప్తు చేశారని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 7న మొదటి విడత పోలింగ్‌ ముగిసిన సంగతి తెలిసిందే.