Jan 18,2023 07:55

నాలో ఏదో కలవరం
కలలో కూడా కకావికలం చేస్తూ
ఉన్నపళంగా తట్టి లేపుతుంది

సమాజాన్ని నడుముకు కట్టుకుని
జన జీవన సరళిని అక్కడే వదిలేసి
కాలం పరుగులు పెడుతుంటే
చాలా కలవరం వేస్తోంది

ఏ పేగు తీగను మీటినా
ఆ సగటు రాగమే తీస్తుంది
ఏ గుండెను తట్టినా
ఆ బతుకు చప్పుడే చేస్తుంది
ఈ ఒడిదుడుకుల్లో మనిషి స్థితి
ఏమైపోతుందోనన్న కలవరం

ఏ కరువు కథలోకి తొంగిచూసినా
ఆ చెట్టు మోడే కనిపిస్తుంది
ఏ పుట్టను పెకిలించినా
ఆ కబ్జా స్వరమే బుసలు కొడుతుంది
ఈ జీవన గతుల అతుకుల దారిలో
జీవితం ఎక్కడ పడిపోతుందేమోనని
ఒకటే కలవరం

ఏ రాతిని ముట్టుకున్నా
కర్షక ఆకలి ఘోష వినపడుతుంది
ఏ మనిషి మనసును కదిలించినా
ఆ కరువు కథే వినిపిస్తోంది
ఏ స్థితిని తాకినా
ఆ దు:ఖపు రాగమే పాడుతుంది

ముదిమి దాటినా సరే
ఈ మనిషి మదిలో
కలవరం తగ్గలేదనే గగుర్పాటును
తిలకించే కళ్ళకు కలవరం
ఎప్పటికి తగ్గుతుందో హతవిధీ.

- నరెద్దుల రాజారెడ్డి,
సెల్‌: 9666016636