Jun 29,2023 16:03

ప్రజాశక్తి-భట్టిప్రోలు: వెల్లటూరు రోడ్డులోని హెరిటేజ్ పాల ఫ్యాక్టరీని మూసివేస్తున్న నేపథ్యంలో అందులో పని చేస్తున్న కార్మికులకు లేబర్ యాక్ట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్, భట్టిప్రోలు మండల కమిటీ సభ్యులు ఎం సత్యనారాయణ, రైతు సంఘం బాపట్ల జిల్లా కమిటీ కార్యదర్శి వి వెంకట్రామయ్యలు డిమాండ్ చేశారు. హెరిటేజ్ పాల ఫ్యాక్టరీని మూసివేస్తున్నట్లు పత్రికలలో వచ్చిన నేపథ్యంలో గురువారం ఉదయం సిపిఎం నాయకులు హెరిటేజ్ ను సందర్శించి ప్లాంట్ మేనేజర్ భాషాతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ హెరిటేజ్ ప్లాంట్ లోని ప్యాకింగ్ సిస్టంను వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్లు తెలిపారని కావున ఆ సెక్షన్ లో పనిచేస్తున్న కార్మికులను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు తెలిపారు. సుమారు పది సంవత్సరములు పైనుండి పనిచేస్తున్న కార్మికులను హఠాత్తుగా తొలగించటం అన్యాయమని ఈ విషయంపై భట్టిప్రోలు తాసిల్దార్ సమక్షంలో కార్మికులకు యాజమాన్యానికి జాయింట్ మీటింగ్ నిర్వహించి తగిన నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల ఈ సమస్యపై స్థానిక రాజకీయ పార్టీలతోనూ ప్రజాసంఘాలను కలుపుకొని ఆందోళన నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.