ఎవరు పోల్చారో
పోల్చుకున్నారో మొదటిగా
మనుషుల్ని వెంటాడుతోందది
మనసు మనసునీ మెలి పెడుతోంది
మనసంటూ లేని ఈ పోలిక
మనిషి మనిషికీ పోలిక
ఇంటికి ఇంటికీ పోలిక
ప్రతి అక్షరానికీ
మరో అక్షరంతో
క్షయం కాని పోలిక
కవిత కవితకీ పోలిక
పంక్తి పంక్తికీ పోలిక
కథ కథకీ పోలిక
కవి కవికీ పోలిక
అనవసర అసందర్భ అసహన పోలిక
కార్యకారణం కావ్యకారణం
లేని నిరంకుశ పోలిక
నిష్కారణ పోలిక
తెలుపుకి నలుపుకీ
తేడా తెలిసినా
మళ్ళీ కొత్త పోలిక
మరో మెలిక
పనిదినానికి విశ్రాంతికీ
అవిశ్రాంతంగా ఆవిష్క ృతమయ్యే
అర్థంలేని పోలిక
నిద్రపోనివ్వని మేలుకోని
మస్తిష్కంలో ప్రతిదీ పోలికే
ఓ కొలిక్కి ఎప్పుడూ రాలేని
పోలికేక లాంటి నిశ్శబ్ద పోలిక
ఎందుకో మరి
మనిషి బతికున్నంతవరకూ
చంపుతోందీ పోలిక!
- జంధ్యాల రఘుబాబు
9849753298










