Sep 23,2023 15:51

ప్రజాశక్తి-ఉండి: అన్ని వసతులతో పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు. శనివారం ఉండి మండలం ఉండి కాపులపేట 67, 69 పోలింగ్ స్టేషన్లను  జిల్లా కలెక్టరు ఆకస్మిక  తనిఖీ చేశారు. పోలింగు స్టేషన్లలో గదులు, విద్యుత్తు, తలుపులు, కిటికీలు, మరుగుదొడ్లు, ర్యాంపులు, పరిసరాలను జిల్లా కలెక్టరు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు  మాట్లాడుతూ రెండు కిలోమీటర్ల పరిధిలోపుగా పోలింగ్ స్టేషన్ ను ఖచ్చితంగా  ఏర్పాటు చేయాలన్నారు. పోలింగు స్టేషన్ పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించి, దివ్యాంగుల కొరకు ర్యాంపును  ఏర్పాటు చేసి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం 1,500 లోపు ఓటర్లు ఉంటే ఒక పోలింగు స్టేషన్, దాటితే  అదనపు పోలింగు స్టేషను ఏర్పాటుకు తప్పని సరిగా ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఆమె ఆదేశించారు. ఓకే కుటుంబం, ఒకే అపార్ట్మెంటులో నివసిస్తున్న ఓటర్లు అందరూ ఓకే పోలింగ్ స్టేషన్లో ఓటు వినియోగించుకునేలా రేషనలైజేషన్  ప్రక్రియలో  అత్యంత బాధ్యతగా పూర్తి చెయ్యాలని అధికార్లకు జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి అడబాల వెంకట అప్పారావు, సిబ్బంది ఉన్నారు.