Jul 01,2023 15:59

ప్రజాశక్తి-ఏలూరు : ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి కుల, మత, ప్రాంతీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతివారికి సంక్షేమ పధకాల సేవలందించే ప్రక్రియే జగనన్న సురక్ష కార్యక్రమం అని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. శనివారం దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామ పంచాయితీ పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమానికి దెందులూరు శాసన సభ్యులు కొఠారి అబ్బయ్యచౌదరి అధ్యక్షతన జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి అర్హులైన ప్రతిఒక్కరికి కుల, మత, ప్రాంతీయ, పార్టీలకు అతీతంగా సంక్షేమ పధకాలు అందించాలనే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నెలరోజులపాటు ఏలూరులోని 605 సచివాలయాల్లో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.  సోమవరప్పాడు గ్రామ పంచాయితీ పరిధిలో ప్రభుత్వ సంక్షేమ పధకాలు 90శాతం మందికి అందించడం ఆశ్చర్యపరిచిందని తెలిపారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం సోమవరప్పాడులో మొదటిరోజు జగనన్నసురక్ష కార్యక్రమం ప్రారంభంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. గతంలో సర్టిఫికెట్లకోసం ఆఫీసు కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగేవారని ఇప్పుడు ఆ పరిస్ధితి లేదని ప్రభుత్వమే ఇంటింటికి అధికారులను, వాలంటీర్లను పంపించి ఏ కుటుంబమైనా అర్హత వుండి ఇంకనూ సంక్షేమ పధకాలు పొందని వారిని గుర్తించి వారికి ఉచితంగా 11 ప్రభుత్వ ధరఖాస్తులను అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో సాయంత్రం వరకు అధికారులు ఉంటారని ఈ సమావేశానికి రాలేకపోయినవారు సాయంత్రంలోగా వచ్చి సమస్యను తెలియజేయవచ్చని చెప్పారు.  కొన్ని సమస్యలు చట్టప్రకారం పరిష్కరించడం జరుగుతుందని, సివిల్ వివాదాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో భాద్యతాయుతంగా అధికారులు వాటి గురించి తెలియజేస్తారని చెప్పారు.  గ్రీవెన్స్, గడపడగపకూ మన ప్రభుత్వం లో వచ్చిన ప్రతి అర్జీని స్వయంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సీనియర్ అధికారులు స్వయంగా పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.  ఈ జగనన్న సురక్ష కార్యక్రమానికి జూన్, 24 నుంచి 30 వరకు వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టి ఇంకా అర్హత ఉండి సాంకేతకపరమైన సమస్యలున్నవాటిని గుర్తించిన వాటిలో 168 సమస్యలు వచ్చాయని తెలిపారు. ఈ జగనన్న సురక్ష పధకాన్ని ఉపయోగించుకోవాలని కలెక్టర్ కోరారు.