చెలరేగే చెట్ల కొమ్మల్లోంచి
ఊసులాడే ఆకుల సందుల్లోంచి
ముసిముసిగా నవ్విన కిరణాలు
ఒకింత చూపుల్ని ఒంపుతున్నాయి .
కరుణించని చలి
కొత్తగా కొరుకుతుంది
నిద్ర నుంచి లేవాలనే ఉంటుంది
గాలికి ఎదురీదాలనే ఉంటుంది
చెవుల్లో గాలులు గంతులేస్తున్నాయి.
మనసులో తపనలు
మధన పడుతుంటాయి
కాలాలు జారినపుడు
పూల పరిభాషలో వేసుకుంటాను
ఆకాశం రంగులు పులుముకున్నట్లు
కలల ప్రపంచంలో రంగుల పక్షిలా ఎగురుతాను
పిల్ల కాలువ నీటిలా
చలి చలిగా వొణుకుతుంటాను
తెల్లవారు చలిమంట కోసం
ఎండిన ఆకుల కోసం
చూపులు పరితపిస్తుంటాయి
కాలాలు ఎంత గొప్పవో కదా
మనం ఎలా వున్నా
దాని ఉనికిని గుప్పెట్లో వాల్చుతుంది.
ఎంత పోడుబారినా
హత్తుకొనే చలి మంట పైనే
ఎంత ప్రేమ
వరికంకులపై పిచ్చుకలు వాలినట్లు. ..!
- గవిడి శ్రీనివాస్
701927 8368










