- సమస్య పరిష్కారానికి కలెక్టర్ హామీ
ప్రజాశక్తి- పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : కొద్ది రోజులుగా కాఫీ సాగు ప్రోత్సాహక బకాయిల సమస్యపై పోరాడుతున్న గిరిజన రైతులు శుక్రవారం మూకుమ్మడిగా పాడేరు ఏజెన్సీ నలుమూలల నుంచి కదిలి వచ్చి ఐటిడిఎను ముట్టడించారు. తొలుత ఎపి గిరిజన సంఘం కార్యాలయం నుంచి వారంతా ర్యాలీగా తరలివచ్చారు. రెండు గంటలసేపు ఐటిడిఎ ముందు బైఠాయించారు. బకాయిలను వెంటనే చెల్లించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఏజెన్సీలో కాఫీ ప్రాజెక్టును కొనసాగించాలని, కాఫీ రైతులకు ఇచ్చే సిల్వర్ ఓక్, కాఫీ మొక్కలతోపాటు పండ్ల మొక్కలనూ పంపిణీ చేయాలని, కోల్డ్ స్టోరేజీలు, నిచ్చెనలు, రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వారి ఆందోళనకు ఎపి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మద్దతు తెలుపుతూ మాట్లాడారు. కాఫీ ప్రోత్సాహక బకాయిలను పోరాడి సాధించుకుంటామన్నారు. ఎపి కాఫీ రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాలికి లక్కు మాట్లాడుతూ రెండున్నర లక్షల ఎకరాల్లో లక్షన్నర మంది గిరిజనులు కాఫీ సాగు చేస్తోన్నా వారికి ప్రభుత్వ సహకారం అందడం లేదని విమర్శించారు. కాఫీ రైతులకు రూ.60 కోట్లు బకాయిలను ఇప్పటి వరకూ చెల్లించకపోవడం శోచనీయమన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సిపిఎం అనంతగిరి జెడ్‌పిటిసి సభ్యులు డి.గంగరాజు మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే ప్రణాళికలను ఐటిడిఎ రూపొందించాలని కోరారు. కార్యక్రమంలో కాఫీ రైతుల సంఘం నాయకులు, సుంకరమెట్ట సర్పంచ్ గెమ్మెలి చినబాబు తదితరులు పాల్గన్నారు. రైతుల ఆందోళనకు స్పందించిన జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ వారి వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో కాఫీ రైతులకు తోడ్పాటు అందించేందుకు బ్యాంకర్ల ద్వారా రూ.25 కోట్ల రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సాంకేతికపరంగా కొన్ని స్కీముల నుంచి నిధులు రానందున కాఫీ రైతులకు ప్రోత్సాహక బకాయిలు చెల్లించలేకపోయామన్నారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.