ప్రజాశక్తి-పాలకొల్లు(పశ్చిమగోదావరి) : కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈనెల 26న నరసాపురం సబ్ కలెక్టరేట్ ఎదుట జరిగే జిల్లా సదస్సు, ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల.హరేరామ్ పిలుపునిచ్చారు. గురువారం పాలకొల్లు మహిళా సంఘం భవనంలో కొబ్బరి రైతుల జిల్లా సదస్సును ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరేరామ్ మాట్లాడుతూ.. ఈనెల 26 ఉదయం 10 గంటలకు నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా అనంతరం సదస్సు జరుగుతుందని చెప్పారు. జిల్లాలో అన్ని మండలాల కొబ్బరి రైతులు ఈ సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కొబ్బరి రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఎకరానికి కొబ్బరి తోటకు 60 వేలకు పైగా పెట్టుబడి అవుతుందని, చెట్టు నుండి కొబ్బరికాయ కోసి గుట్టగా వేయడానికి కాయకు, రూ.3 ఖర్చు అవుతుందని అన్నారు. వ్యాపారులు ఎండు కొబ్బరికాయకు రూ7/-లు మించి ధర ఇవ్వడం లేదని అన్నారు. రైతు చేతికి 3 రూపాయలు వస్తుందని కనీస పెట్టుబడి ఖర్చులు కూడా రాక కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి కొబ్బరి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం వల్లనే కొబ్బరి రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. విదేశీ కొబ్బరి ఉత్పత్తుల దిగుమతులు ఆపాలని కోరారు. నాఫెడ్, ఆయిల్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయిల్ పెడ్ కమిషనర్ తూ.గో. జిల్లాలో ప్రకటించడం జరిగిందని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మిల్లింగ్ కొబ్బరి క్వింటాల్ కు రూ.10,860 లు, బంతి కొబ్బరి క్వింటాల్ కు రూ.11,750 లు రైతుకు ఏమాత్రం గిట్టుబాటు కాదన్నారు. ఈ కేంద్రాలు వ్యాపారులకు ఉపయోగం తప్ప రైతుకి ఏమాత్రం ప్రయోజనకరం కాదన్నారు. ఒక్కో కొబ్బరికాయకు రూ.15 .లు. ధర ఇచ్చి రైతుల నుండి కొబ్బరికాయలు సేకరణ చేసే విధంగా కొనుగోలు నిబంధనలు మార్చాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ధరల స్థిరీక రణ నిధి పథకం వర్తింప చేసి కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కొబ్బరి రైతుల సమస్యలు పరిష్కారానికి సంఘటితం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తూటే మార్టిన్ లూథర్, యర్రా అజరు కుమార్, చోడదాసి అగస్టిన్, ఎస్. పురుషోత్తం, చల్లా సోమేశ్వరరావు, ఎం. త్రిమూర్తులు. తిరుమణి నాగ రాజు తదితరులు పాల్గొన్నారు.










