Sep 07,2023 12:34

న్యూఢిల్లీ :   ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ల ద్వైపాక్షిక సమావేశంలో పర్యావరణ మార్పు ప్రధాన అజెండాగా ఉండనున్నట్లు వైట్‌హౌస్‌కి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు గురువారం తెలిపారు. రష్యా -ఉక్రెయిన్‌ యుద్ధం అంశంతో పాటు ఆర్థిక సహకారం, బహుళపాక్షిక అభివృద్ధి బ్యాంకు సంస్కరణలు అంశాలు ఉండనున్నట్లు వెల్లడించారు. జి 20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ నేడు భారత్‌కు వెళ్లనున్నట్లు జాతీయ భద్రతా మండలి (ఎన్‌ఎస్‌ఎ) వ్యూహాత్మక సమాచార సమన్వయ కర్త జాన్‌ కిర్బీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సమావేశంలో చర్చించే అంశాలపై ఆయన స్పందిస్తూ.. జి 20 సదస్సు ప్రధాన అజెండాతో పాటు ఆర్థిక సహకారం, బహుళపాక్షిక పెట్టుబడి అవకాశాలు గురించి చర్చ జరగవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఇండో -పసిఫిక్‌ భద్రత, ఆర్థిక మరియు దౌత్యపరమైన సవాళ్లు చర్చించే అంశాల్లో ఉండవచ్చని అన్నారు. అయితే ద్వైపాక్షిక సమావేశ సమయాన్ని భారత అధికారులు ఇంకా ధృవీకరించలేదని, శుక్రవారం జరగవచ్చని భావిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సుల్లీవన్‌ తెలిపారు. శుక్రవారం ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు ఉండవచ్చని, శనివారం , ఆదివారం బైడెన్‌ జి20 సదస్సులో పాల్గంటారని అన్నారు. జి20 పట్ల అమెరికా నిబద్ధత కలిగి ఉందని, ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయాల్లోనూ కలిసి పనిచేయగలవని ఈ జి20 సదస్సు చూపుతుందని ఎన్‌ఎస్‌ఎ పేర్కొంది.