
ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో శనివారం విద్యార్థులకు పర్యావరణహిత వినాయక విగ్రహాల తయారీ పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ, ప్రోత్సాహక బహుమతులు అందజేసారు. కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు, కార్యదర్శి కలిదిండి రామరాజు చేతుల మీదుగా సర్టిఫికెట్స్, మెడల్స్ బహూకరించారు. నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థులలో అంతర్లీనంగా నిబిడీకృతం అయి ఉన్న వివిధ కళా నైపుణ్యాన్ని, పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని తెలియచేయటకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని, విఘ్నేశుడు ప్రతి రూపాన్ని ఏ రూపంలో తయారుచేసిన అందంగానే ఉంటుందని, విద్యార్థులు ప్రదర్శించిన వివిధ వినాయక రూపాలను చూసి విద్యార్థులను ప్రశంసించారు. రామరాజు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు సంస్కృతిక, కళ ప్రావీణ్యం సంపాదించుకొనుట అత్యంత ముఖ్యం అని అన్నారు. ప్రిన్సిపల్ డా. డి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులలో ఉన్న సృజనాత్మకత, వివిధ పండుగల విశిష్టతను విద్యార్థుల్లో లౌకికత, భిన్నత్వంలో ఏకత్వం చాటి చెప్పుటకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.