ప్రజాశక్తి-మండపేట : అంగన్వాడి వర్కర్స్ కు గత రెండు నెలలుగా బకాయి పడ్డ వేతనాలను తక్షణం చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కే.కృష్ణవేణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆమె ప్రజాశక్తి దినపత్రికతో మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో బ్రతుకుతున్న అంగన్వాడీలకు గత రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం చాలా దారుణమన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1759 అంగన్వాడి కేంద్రం ఉండగా వీటిలో 3340 మంది కార్యకర్తలు పనిచేస్తుండగా మరో 89 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీలకు మాత్రం సక్రమంగా వేతనాలు చెల్లించకపోగా ఒక వైపు ఫుడ్ కమిషనర్ వేధింపులు మరొక వైపు మెనూ ప్రకారం వండాలంటే నెలలు తరబడి బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే 2017 నుండి పెండింగ్ లో ఉన్న టి.ఏ బిల్లులు చెల్లింపులు జరగలేదన్నారు. గత 5 నెలల నుంచి కాయకురాలు, గ్యాస్ బిల్లులు చెల్లించడం లేదన్నారు. నాలుగు నెలల నుంచి అద్దెలు
చెల్లించడంలేదన్నారు. ఒకటో తారీకుకి నాటికి ప్రతినెల వేతనాలు చెల్లిస్తానన్న ముఖ్యమంత్రి జగన్ హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. తక్షణం వేతనాలు చెల్లించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.










