Sep 05,2023 21:50
  • తొలిరౌండ్‌లోనే అందరూ ఇంటిదారి

గాంగ్జూ(చైనా): చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ సింగిల్స్‌లో భారత షట్లర్లు తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణరు, లక్ష్యసేన్‌తోపాటు మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌-త్రీసా జోలీ జంట పరాజయాన్ని చవిచూశారు. 6వ సీడ్‌ హెచ్‌ఎస్‌ ప్రణరు 12-21, 21-13, 18-21తో 22వ సీడ్‌ ఎన్‌జి యంగ్‌(మలేషియా) చేతిలో, లక్ష్యసేన్‌ 21-23, 21-16, 9-21తో 10వ సీడ్‌ ఆండెర్స్‌ ఆంటోన్సెన్‌(డెన్మార్క్‌) చేతిలో పోరాడి ఓడారు. 31ఏళ్ల హెచ్‌ఎస్‌ ప్రణరు రారు ఇటీవల ముగిసిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యపతకంతో సత్తాచాటినా.. ఈ టోర్నీలో తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టి నిరాశపరిచాడు. ఇక లక్ష్యసేన్‌ గంటా 18నిమిషాలసేపు సాగిన హోరాహోరీ పోరులో పోరాడి ఆటమిని అంగీకరించాడు. ఇంతకుముందు జరిగిన మరో సింగిల్స్‌లో ప్రియాన్షు రాజ్‌వత్‌ 13-21, 24-26తో ఇండోనేషియాకు చెందిన శేషర్‌ హరెన్‌ చేతిలో ఓడాడు. ఇక పురుషుల డబుల్స్‌లో ఎంఆర్‌ అర్జున్‌-ధృవ్‌ కపిల జోడీ 21-23, 19-21తో జపాన్‌ డబుల్స్‌ జోడీ చేతిలో ఓడారు. ఇక మహిళల సింగల్స్‌లో పివి సింధు ఈ టోర్నీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక పురుషుల డబుల్స్‌లో మిగిలిన చిరాగ్‌ శెట్టి-సాత్త్విక్‌తోపాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ కపూర్‌-సిక్కిరెడ్డి జోడీ బుధవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.