ఒక ఊరులో గంగన్న అనే సన్నకారు రైతు ఉన్నాడు. తనకు వ్యవసాయం తప్ప మరో పని తెలియదు. ఓ ఏడాది వర్షాలు లేక పంట ఎండిపోయి నష్టం వచ్చింది. అయినా పట్టు వదలకుండా అప్పు చేసి మరీ మరో ఏడాది వ్యవ సాయం చేశాడు. ఆ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి. పంట బాగా పండింది. దాంతో గంగన్న ఆనందించాడు. వచ్చే ఆదాయంతో అప్పు తీరి, కుటుంబంతో సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాడు. ధాన్యం బస్తాలను బండిలో ఎక్కించి అమ్మేందుకు పట్టణం తీసుకెళ్లాడు.
కాని అక్కడ వ్యాపారులు ఆ ధాన్యం తీసుకుని ఐదు వేలు ఇచ్చారు. పది వేలు పంటకు ఐదు వేలు ఇచ్చారేంటి అని గంగన్న ప్రశ్నించాడు. 'ఈ రోజు ధర ఇంతే ఉంది. ఇంత కంటే ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు.' అంటూ కఠినంగా మాట్లాడాడు వ్యాపారి. దాంతో గంగన్న ఏడుస్తూ ఉండిపోయా డు. ఆ వచ్చిన డబ్బుతో అప్పు తీరదని బాధపడ్డాడు. ఏం చేయాలో తెలియక ఇంటికి వచ్చాడు. జరిగిన విషయాన్ని భార్యకు చెప్పాడు. ఇక రైతు కష్టాలు ఎప్పటికీ తీరవని నిర్ణ యించుకున్నారు. చనిపోదాం అనుకున్నారు. అప్పుడే స్కూలు నుంచి ఇంటికి వచ్చిన తేజ వారి మాటలు విన్నది. వారి ప్రయ త్నాన్ని అడ్డుకుంది. తరువాత ముఖ్యమంత్రికి లేఖ రాసింది.
''గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి.. మా నాన్న సంవత్సరం పాటు కష్టపడి పండించిన పంటకు సరైన ధర లేక అప్పులు అయ్యాయి. అవి తీర్చలేక చనిపోదాం అనుకుంటు న్నాడు. అప్పుడు నేను అనాధనవుతాను. మీరే మా సమస్యకు పరిష్కారం చూపగలరు. ఎవరి కష్టానికైనా తగిన గిట్టుబాటు ధర రావాలి కదా? ఏళ్లకు తరబడి రైతు ఇలా దు:ఖించటం రాజ్యానికి మంచిది కాదు కదా?' అని పేర్కొంది. సిఎం ఎలా స్పందిస్తారో అని తేజ ఎదురుచూస్తోంది. ఫ్రెండ్స్, దేశానికి ధాన్యం పండిస్తున్న రైతులు మన చుట్టూ, ఎందరో ఉంటారు. వారికి మన సపోర్టు అందిద్దాం. సరేనా?.
- ఎం. తేజశ్రీ,
9వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,










