Jun 22,2023 10:04
  • మూడేళ్ల లోపు పిల్లలకు నీరు, ఆహారం వంటి వాటిని సమయానికే సమకూరుస్తారు చాలామంది తల్లిదండ్రులు. ఇక వయసు పెరిగేకొద్దీ తమకు ఏం కావాలో పిల్లలే అడుగుతుంటారు. కానీ చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్‌క్రీం అడిగినంత ఉత్సాహంగా దాహంగా ఉందని, ఆకలి వేస్తుందని మాత్రం అనరు. అంతేకాదు.. ఒక్కోసారి పిల్లలు విచిత్రంగా మారిపోతుంటారు. అప్పటివరకు ఆడుకుంటున్న వారైనా ఒక్కసారి ఏడుపులంకించుకుంటే ఒక పట్టాన వదలరు. ఎవరైనా కొట్టారో.. తిట్టారో కూడా చెప్పరు. మరి అలాంటి భిన్న మనస్తత్వాలున్న పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? పిల్లల మూడ్స్‌ను అర్థం చేసుకుంటేనే అది వారి పెరుగుదలకు దోహదపడుతుందని ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు?

పదే పదే ఏడుస్తున్న పిల్లలతో 'ఎప్పుడూ నీది ఏడుపుకొట్టు ముఖమే' అనే తల్లిదండ్రులు చాలామందే ఉంటారు. అలాగే తరచూ అనారోగ్యం బారిన పడే పిల్లలతో కూడా కొంతమంది 'నీకు రోగం లేని రోజంటూ ఉందా' అనడం కూడా వింటుంటాం. పిల్లల ప్రవర్తన, స్థితిని బట్టి అనవసర లేబుల్స్‌ వేయడం చాలా ప్రమాదం. అది మానసికంగా వారిని కుంగదీస్తుంది. తమ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకోలేరు.
'మా రోజుల్లో పిల్లలు ఇలా లేరు.. మేము మా అమ్మానాన్న చెప్పినట్లు వినేవాళ్లం. వాళ్లు ఏం పెడితే అది తినేవాళ్లం. వంకలు అసలు పెట్టేవాళ్లం కాదు. మీకు అన్నీ సమకూర్చిపెడుతుంటే ఏం తెలియడం లేదు. ఇష్టానుసారం చేస్తున్నారు' అంటూ పిల్లలను విసుక్కోవడం చాలామంది ఇళ్లల్లో వినిపిస్తుంది. ఆ మాటలు అంటున్నప్పుడు ఒక్కసారి పిల్లల ముఖాలు చూడండి. మనం ఏం అంటున్నామో. ఆ మాటలకు అర్థాలు ఏంటో కూడా వాళ్లకు తెలియవు. బిక్కచచ్చిన ముఖాలతో భయంభయంగా చూస్తూ ఉంటారు.
కోపం, దు:ఖం, సంతోషం, ఆనందం, విచారం, ఒత్తిడి, ఆత్మస్థైర్యం, నిరాశ, అసహనం వంటివి పెద్దల్లోనే కాదు పిల్లల్లో ఉండే సహజ లక్షణాలు కూడా. వాటినేమీ పట్టించుకోకుండా మీ పాటికి మీరు పిల్లలపై అరుస్తూ.. తిడుతూ.. కోప్పడుతూ ఉంటే వారి భావోద్వేగాలు మీకు ఎలా అర్థమౌతాయి. ఆకలిగా ఉందని, దాహంగా ఉందనే కాదు.. ఈ పని చేయడం వల్ల నాకు చాలా కోపంగా ఉందని, బాధగా ఉందని, భయమేస్తుందని కూడా పిల్లలు చెప్పలేరు. తల్లిదండ్రులుగా వారి మూడ్స్‌ను మీరే అర్థం చేసుకోవాలి.
'అమ్మానాన్న నేను చెప్పే విషయాలు ఓపిగ్గా వింటారు. నా మాటలను పట్టించుకుంటారు' అన్న భావన పిల్లల్లో కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అలా చేస్తే.. ఏ విషయమైనా తల్లిదండ్రులతో పంచుకునేందుకు పిల్లలు సంకోచించరు.
ఇప్పుడు స్కూళ్లు తెరిచారు కదా. ఆటోలోనో, బస్సులోనో పిల్లలను ఒంటరిగా స్కూలుకు పంపిస్తుంటాం. అసలే రోజులు బాగోలేవు.. ఆడపిల్లలు, మగపిల్లలు అన్న తేడా లేకుండా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మొన్నీమధ్య హైద్రాబాద్‌లో ఓ స్కూల్లో ఆరేళ్ల పసిపిల్లపై డ్రైవరు చేసిన దారుణం మన కళ్ల ముందే ఉంది. ఆ ఉదంతం వెలుగుచూశాకే తమ పిల్లలపై కూడా దాడులు జరిగినట్లు చాలామంది పిల్లల తల్లిదండ్రులు బయటికి వచ్చారు. అసలు పరిస్థితి అంతవరకు రానీయొద్దు. ఏదైనా అమానవీయ ఘటనో.. అసాధారణ పరిస్థితో తమకు ఎదురైందని ఘటన జరిగిన వెంటనే స్వేచ్ఛగా చెప్పే ధైర్యం పిల్లల్లో కలిగించాలి. ఆ భావన రావాలంటే పిల్లల భావోద్వేగాలను పట్టించుకోవాలి. వారి భావాలను అర్థం చేసుకోవాలి.