- గాజాకు ఇంధనం నిలిపివేసిన ఇజ్రాయిల్
- ప్రమాదకరంగా 120 మంది చిన్నారుల పరిస్థితి : ఐరాస ఆందోళన
జెరూసలేం : గాజాకు ఇజ్రాయిల్ ఇంధనం నిలిపివేయడంతో ఇన్‌క్యూబరేటర్లలో ఉన్న సుమారు 120 మంది నవజాత శిశువుల పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో వివిధ ఆసుపత్రుల్లో సుమారు 120 మంది నవజాత శిశువులు ఇన్‌క్యూబ్‌రేటర్లలో ఉన్నారు, ఇంధన నిల్వలు చివరిదశకు రావడంతో వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఐరాసకు చెందిన యునిసెఫ్ ఆదివారం తెలిపింది. వీరందరినీ విద్యుత్‌తో నడిచే ఇన్‌క్యూబరేటర్లలో ఉంచామని, ఇజ్రాయిల్ విద్యుత్ సరఫరా నిలిపివేస్తే వీరి ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే అని యునిసెఫ్ ప్రతినిధి తెలిపారు.
ఇజ్రాయిల్ తరచూ విద్యుత్ కోతలు విధిస్తుండటంతో, గాజా ఆసుపత్రుల్లో జనరేటర్లకు ఇప్పటికే ఇంధనం అయిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ప్రకటించింది. జనరేటర్లు ఆగిపోతే డయాలసిస్ అవసరం ఉన్న సుమారు వెయ్యి మంది ప్రాణాలకు ప్రమాదమని డబ్ల్యూహెచ్‌ఒ తెలిపింది. శనివారం ఈజిప్ట్ నుంచి గాజాకు సహాయక సామగ్రితో 20 ట్రక్కులు వచ్చినా వీటిల్లో ఇంధనం లేదు. హమాస్‌కు ఇంధనం సహాయపడుతుందని ఆరోపిస్తూ గాజాలోకి ఇంధనం పంపించడానికి ఇజ్రాయిల్ అడ్డుపడుతోంది. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం ఈ నెల 7న ఇజ్రాయిల్ దాడులు ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకూ 1,750 మంది చిన్నారులు మరణించారు. గాజాలోని ఆసుపత్రులు మందులు, ఇంధనం, నీటి కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. ఇంధనం లేకపోవడంతో సుమారు 130 మంది నవజాత శిశులు చనిపోయే ప్రమాదం ఉందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. ఐరాస పాపులేషన్ ఫండ్ ప్రకారం గాజాలో ప్రతి రోజూ 160 ప్రసవాలు జరుగుతున్నాయి. గాజాలో ప్రస్తుతం సుమారు 50 వేల మంది గర్భిణులు ఉన్నారని అంచనా. వీరిలో ఇప్పటికే కొన్ని వందల మంది ఇజ్రాయిల్ ప్రస్తుత దాడుల్లో మరణించారు.
ఇజ్రాయిల్ దాడుల్లో 4,651 మంది మృతి
ఇజ్రాయిల్ దాడుల కారణంగా గాజాలో ఇప్పటి వరకూ 4,651 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. వీరిలో 1,873 మంది చిన్నారులు ఉన్నారని తెలిపింది. మరో 14,245 మంది గాయపడినట్లు తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున కూడా దక్షిణ గాజాపై వైమానిక దాడులతో ఇజ్రాయిల్ విరుచుకుపడింది.
గాజాపై యుద్ధం ఆపండి : పోప్ ఫ్రాన్సిస్
గాజాపై ఇజ్రాయిల్ తన యుద్ధాన్ని తక్షణమే ఆపాలని పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం పిలుపునిచ్చారు. గాజాలోకి మరింత మాననీయ సహాయాన్ని అనుమతించాలని ఇజ్రాయిల్‌కు విజ్ఞప్తి చేశారు. రోమ్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద ఆదివారం ప్రార్థనల తరువాత పోప్ ఈ పిలుపునిచ్చారు. 'యుద్ధంతో ఎల్లప్పుడూ ఓటమే ఎదురవుతుంది. యుద్ధం మానవ సోదరభావాన్ని నాశనం చేస్తుంది' అని పోప్ తెలిపారు. సరిహద్దులు తెరవాలని, మానవతా సహాయం అందించడం కొనసాగించాలని, బందీలను విడుదల చేయాలని మరోసారి కోరారు.
మరో 17 ట్రక్కుల సహాయం
87 టన్నుల ఆహారం, వైద్య పరికరాలతో రెండు విమానాలు ఖతార్ నుంచి ఈజిప్టు నగరమైన అల్-అరిష్‌కు చేరుకున్నాయని ఖతార్ విదేశాంగ మంత్రి తెలిపారు. ఆదివారం ఈజిప్టు వైపు నుంచి 17 ట్రక్కుల సహాయ సామాగ్రి గాజాలోకి ప్రవేశించింది. శనివారం 20 ట్రక్కుల సహాయం వెళ్లిన సంగతి తెలిసిందే. గాజా అవసరాలు తీరడానికి రోజుకు కనీసం 100 ట్రక్కుల సహాయం అవసరమని ఐరాస అంచనా వేస్తోంది.
ఇజ్రాయిల్ ద్వారా అమెరికా యుద్ధం చేస్తోంది : ఇరాన్
అణచివేతకు గురైన పాలస్తీనా సాధారణ ప్రజలపై ఇజ్రాయిల్ ద్వారా అమెరికా యుద్ధం చేస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి హోసిన్ అమిర్ అబ్డోల్లాహియాన్ విమర్శించారు. ఆసుపత్రులు, మసీదులు, చర్చిలు, సాధారణ పౌరులపై ఇజ్రాయిల్ దాడులకు మద్ధతు ఇచ్చేందుకు బైడెన్ వెళ్లడం దురదృష్టకరమని అన్నారు. గాజాలో ఇజ్రాయిల్ చేస్తున్న హత్యలు, సామూహిక హత్యలకు మద్దతుగా ఆయుధాలతో నిండిన వందలాది విమానాలు, షిప్‌లు, ట్రక్కులు పంపిస్తానని ప్రకటించడం శోచనీయమని విమర్శించారు.
పాలస్తీనాకు భారత్ సాయం..
6.5 టన్నుల సామగ్రితో బయల్దేరిన విమానం
ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనా ప్రజలకు సాయం అందించేందుకు భారత్ సిద్ధమైంది. సామగ్రి, ఔషధాలను ఆదివారం గాజాకు పంపించింది. 'ప్రాణాధార ఔషధాలు, శస్త్రచికిత్స వస్తువులు, గుడారాలు, స్లీపింగ్ బ్యాగ్స్, టార్పాలిన్లు, శానిటరీ యుటిలిటీస్, నీటి శుద్ధీకరణ మాత్రలు ఇతర వస్తువులను' మానవతా సాయంలో భాగంగా పంపిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్విటర్‌లో(ఎక్స్)లో పోస్టు పెట్టారు. భారత వైమానిక దళానికి చెందిన ఐఎఎఫ్ సీ-17 విమానంలో మొత్తం 6.5 టన్నుల సామగ్రి వెళ్తోందని చెప్పారు. ఈ సామగ్రిని తొలుత ఈజిప్టులోని ఈఎల్-అరిష్ విమానాశ్రయానికి చేరుస్తారు. అక్కడి నుంచి రఫా సరిహద్దు గుండా గాజాకు తీసుకెళ్తారని తెలిపారు.
యుద్ధాన్ని విస్తరిస్తున్న ఇజ్రాయిల్ - గాజాతో సహా వెస్ట్‌బ్యాంక్, సిరియాపైనా దాడులు
జెరూసలేం : హమాస్‌తో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని ఇజ్రాయిల్ మరింత విస్తరించే దిశగా సాగుతోంది. ఆదివారం గాజాతో పాటు వెస్ట్‌బ్యాంక్, సిరియాపై కూడా ఇజ్రాయిల్ దాడులకు పాల్పడింది. ఆదివారం తెల్లవారు జామున ప్రారంభమైన దాడులు సాయంత్రం వరకూ కొనసాగాయి. వెస్ట్‌బ్యాంక్‌లో ఒక మసీదుతోపాటు, సిరియాలో రెండు విమానాశ్రయాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. అలాగే ఈ యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా లెబనాన్ యొక్క హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపుపైనా ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు గాజాపై భూతల దాడులకు కూడా ఇజ్రాయిల్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. గాజా సరిహద్దుల వద్ద వందల యుద్ధ ట్యాంక్‌లతో సహా పది వేల మంది సైనికుల్ని మోహరింప చేసింది.