అనారోగ్యంతో నెల రోజుల్లో నలుగురు విద్యార్థులు మృతి
ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం(పార్వతీపురం మన్యం జిల్లా) : ఉన్నత చదువులు చదవాలని, ఉద్యోగం చేసి తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలని కన్న ఆ గిరిజన విద్యార్థులు కలలు కలలుగానే మిగిలిపోయాయి. చదువుకునే పసి ప్రాయంలో వివిధ వ్యాధులతో అనారోగ్యం బారినపడి నిండు నూరేళ్లు జీవించా ల్సిన పసి మొగ్గలు పదహారేళ్లకే మృత్యుడికి చేరు తున్నారు. దీంతో ఆ ఇంట విషాదాన్ని నింపుతు న్నారు. జిల్లాలో నెల రోజుల్లో నలుగురు గిరిజన విద్యార్థులు అనారోగ్య బారిన పడి మృతి చెందడం బాధాకరం.
మండలంలోని భద్రగిరి ఎపి ఆర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆరిక చరణ్ తేజ్ శనివారం మరణించాడు. రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న హిమరిక ప్రమీల పది రోజుల కిందట బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతూ మతి చెందింది. సీతంపేట మండలం పెద్దపొల్లంకి వలసకు చెందిన బిడ్డిక కార్తికేయ(7) అనే చిన్నారి ఆగష్టులో మలేరియా బారిన పడి మృత్యువాత పడ్డాడు. అలాగే మక్కువ మండలం ఎర్రసామంత వలస ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువు తున్న బిడ్డిక మహేంద్ర జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు.
వైద్యం కోసం.....
పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోని 55 ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, సీతంపేట ఐటిడిఎ పరిధిలో 43 ఆశ్రమ పాఠశాలల్లో వేలాదిమంది విద్యార్థులు చదువుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు విద్యార్థులు అనారోగ్యంతో బాధపడుతూ సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లడం పరిపాటిగా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు వైద్యం కోసం వస్తున్న వారిలో ఎక్కువమంది విద్యార్థులు కనిపిస్తున్నారు. వసతి గృహాల్లో ఆరోగ్య కార్యకర్తల పోస్టుల్లేక విద్యార్థులు వైద్యం కోసం బయట ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు చెబుతున్నారు.
ఆసుపత్రుల్లో వైద్య సేవలు అంతంత మాత్రమే....
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు మెరుగుపడలేదు. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతున్న రోగులకు అన్ని రకాలైన వసతులు కల్పించడంలో మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో వైద్యం అందరం ద్రాక్షగానే మిగిలిపోతుంది. దీంతో వైద్యం కోసం వెళ్తున్న విద్యార్థులకు సాధారణ పరీక్షలతోనే సరిపెడుతు న్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం పార్వతీపురం, విజయనగరం విశాఖపట్నం వంటి దూర ప్రాంతా లకు తరలిస్తున్నారు. సకాలంలో వైద్యం అందక మరణించిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు.
అంతంత మాత్రం మోనూ ఛార్జీలు
రోజురోజుకు నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న విద్యార్థులకు పెడుతున్న భోజనానికి చార్జీలు అంతంత మాత్రం ఉండడంతో విద్యార్థులకు పౌష్టికాహారం పూర్తిస్థాయిలో అందడం లేదు. మరోవైపు మెస్ బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండడంతో వసతి గృహ సంరక్షకులకు భారంగా మారుతుంది. సొంత డబ్బులు పెట్టుకుని, చాలని పరిస్థితుల్లో అప్పులు చేసి విద్యార్థులకు భోజనాలు అందించే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో వంట చేసేందుకు సిబ్బంది కొరత ఎక్కువగా వెంటాడుతుంది. వందలాది మంది విద్యార్థులకు ఒకరో, ఇద్దరో ఉండడంతో చేసేదిలేక వార్డెన్లు మరో ఇద్దరు, ముగ్గుర్ని అదనంగా నియమించుకుని వారికి వేతనాలు చెల్లిస్తున్నారు. ఇది కూడా వార్డెన్లకు భారంగా మారింది. ఐటిడిఎ అధికారులు స్పందించి సిబ్బంది నియామకానికి కూడా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది.