- ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరిన తండ్రి
ప్రజాశక్తి-నిజాంపట్నం (బాపట్ల జిల్లా):బోటు బోల్తా పడి ఓ కుటుంబం సముద్రంలో మునిగిపోగా.. తండ్రి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరాడు. తల్లి, ఇద్దరు బిడ్డలు గల్లంతయ్యారు. ఈ ఘటన నిజాంపట్నం హార్బర్‌లో ఆదివారం జరిగింది. నిజాంపట్నం సిఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఏల్చేటి దిబ్బ గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ సోంబాబు, ఆయన భార్య సాయివర్ధిక (25) వారి వద్దనున్న చిన్న బోటుపై ఇద్దరూ వేటకు వెళ్లి వచ్చి మత్స్య సంపద అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు. వీరికి ఇద్దరు కుమారులు తనీష్‌కుమార్ (7), తరుణేశ్వర్ (11 నెలలు) ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ ఇంటి వద్ద పిల్లల సంరక్షణ చూసుకునే వారు లేక వారినీ తమతో పాటు వేటకు తీసుకుని వెళ్లారు. ఎప్పటిలాగే వేట చేసుకొని వచ్చారు. మత్స్య సంపదను అమ్ముకునే క్రమంలో ఆదివారం సముద్రం నుండి నిజాంపట్నం హార్బర్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పెద్ద అలలు రావటంతో బోటు అదుపుతప్పి అక్కడ ఉన్న రాళ్లకు ఢకొీని తిరగబడింది. దీంతో బోటులో ఉన్న నలుగురూ సముద్రంలో పడిపోయారు. సోంబాబు ఈత కొట్టుకుంటూ ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాడు. తల్లీ బిడ్డలు ముగ్గురు గల్లంతయ్యారు. రాత్రివరకూ వారి ఆచూకీ తెలియలేదు. గల్లంతైన వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.