Aug 13,2023 22:01

- 15 ఏళ్ల లోపు వారికి మధ్యాహ్నం రెండు వరకే అనుమతి
- ఘాట్‌ రోడ్లలో సాయంత్రం ఆరునుంచి ఉదయం ఆరు వరకు రాకపోకలు నిలుపుదల
- చిరుత దాడితో కఠిన ఆంక్షలు
ప్రజాశక్తి - తిరుమల, అమరావతి బ్యూరో :శ్రీవారి సందర్శనార్ధం కాలిబాట నుంచి వచ్చే యాత్రికుల భద్రతపై టిటిడి చర్యలు చేపట్టింది. నడకదారుల్లో పిల్లల అనుమతిపై పలు ఆంక్షలు విధించింది. 15 ఏళ్లలోపు పిల్లలు గల తల్లిదండ్రులను ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో అనుమతించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రెండు ఘాట్‌ రోడ్లలో సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలుపుదల చేసింది. ఏడవ మైలు వద్ద నుంచి చిన్న పిల్లల చేతికి పోలీసులు ట్యాగ్‌ వేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే సులభంగా కనిపెట్టేందుకు ట్యాగులపై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్‌ నెంబర్‌, పోలీసు టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సిబ్బంది జతపరుస్తున్నారు. నడకదారి మార్గంలో అడవి మృగాలు సంచరించే ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి, అక్కడ వన్య మృగాలు నడకదారి దగ్గరకు రాకుండా ఉండేందుకు అవసరమైన సెంట్రీ పోస్టులు, సీసీ కెమెరాలు, ఫెన్సింగ్‌ వంటివి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. జంతువులు వస్తే దూరంగా తరిమేందుకు అవసరమైన లైటింగ్‌ సిస్టం, సౌండింగ్‌ సిస్టంలను సిద్ధం చేస్తున్నారు. క్రూరమృగాల సమస్య పరిష్కారమయ్యే వరకు టిటిడి తీసుకున్న నిర్ణయాలకు యాత్రికులు సహకారం అందించాలని టిటిడి విజ్ఞప్తి చేసింది. కాలినడక మార్గాలు, ఘాట్‌లలో యాత్రికుల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం టిటిడి ఛైర్మన్‌ శ్రీ భూమనకరుణాకర్‌ రెడ్డి తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
జూన్‌ 22న కర్నూలు జిల్లాకు చెందిన నాలుగేళ్ల కౌశిక్‌పై చిరుత దాడి మరవక ముందే నెల్లూరు జిల్లా పోతిరెడ్డి పాలేనికి చెందిన దినేష్‌కుమార్‌ కుమార్తె లక్షితపై చిరుత దాడి చేసి చంపేయడం కలకలం సృష్టించింది. దాడికి పాల్పడిన చిరుతను బంధించడానికి టిటిడి అటవీ అధికారులు బోన్లను ఏర్పాటు చేశారు. తిరుమల రెండవ ఘాట్‌లో 38వ మలుపు వద్ద చిరుత ఆనవాళ్లు ఉండటంతో ఆదివారం మరో బోనును ఏర్పాటు చేశారు. అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలు కలిపి మొత్తం ఐదు ప్రాంతాల్లో శనివారం రాత్రి చిరుత పులుల సంచారం కనిపించింది.

  • నివేదిక కోరిన బాలల హక్కుల కమిషన్‌

చిరుత దాడిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల చిన్నారి లక్షిత మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ బాలల హక్కుల కమిషన్‌ కోరింది. ఈ మేరకు ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం, అటవీ, పోలీస్‌, రెవెన్యూశాఖలకు బాలల హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని కోరారు. తిరుమలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.