ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : చంద్రబాబు భద్రతపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని జైళ్ల శాఖ డిఐజి రవికిరణ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద ఆయన శుక్రవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. 24 గంటలూ సెక్యూరిటీతోపాటు అదనపు సిసి కెమేరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. జైలు చుట్టూ ఐదు వాచ్‌టవర్స్ ఉన్నాయన్నారు. ఈ నెల 22న జైలు వాటర్ ట్యాంక్‌వైపు ఒక డ్రోన్ తిరిగిందని నార్త్ ఈస్ట్ వాచ్‌టవర్ గార్డు నుంచి తమకు సమాచారం వచ్చిందని, క్లోజ్డ్ జైల్ వైపు ఆ డ్రోన్ రాలేదని తెలిపారు. దీనిపై జైళ్లశాఖ నుంచి సమీప పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చామన్నారు. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నకిలీదిగా పోలీసుల విచారణలో తేలిందన్నారు. జైలు నుంచి చంద్రబాబు రాశారంటూ చెబుతున్న లేఖకు జైలు అధికారుల అటెస్టేషన్ చేయలేదని చెప్పారు. శ్రీనివాస్ అనే ఖైదీని రిమాండ్‌కు తెచ్చినప్పుడు ఆయన వద్ద ఒక బటన్ కెమెరా ఉన్నట్లు గుర్తించామని, అందులో ఎలాంటి జైల్ ఫుటేజీ లేదని చెప్పారు. చంద్రబాబు కుడి కంటి కేటరాక్ట్ ఆపరేషన్‌కు సంబంధించి రాజమండ్రి జిజిహెచ్ వైద్యులు పరీక్షలు చేశారని, చంద్రబాబుకు ఇమ్మెచ్యూర్ కేటరాక్ట్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారని చెప్పారు. కొంత సమయం తరువాతైనా ఆపరేషన్ చేయించుకోవచ్చని వైద్యులు సూచించినట్టు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య నివేదికలను ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పిస్తున్నట్టు వెల్లడించారు. చంద్రబాబును ఫోటో తీసిన వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. విచారణ కొనసాగుతోందన్నారు.