- రూ.1.30 కోట్లు సీజ్ చేసిన పోలీసులు
ప్రజాశక్తి -గోపాలపట్నం (విశాఖపట్నం) : వాషింగ్ మెషిన్ల లోడు మాటున తరలిపోతున్న నగదును విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసులు మంగళవారం అర్థరాత్రి పట్టుకున్నారు. ఎయిర్‌పోర్టు సిఐ బిఎండి ప్రసాదరావు కథనం ప్రకారం... ఎలక్ట్రానిక్ వస్తువుల లోడుతో ఓ ఆటో రాత్రిపూట వెళ్తోంది. ఆటో వెనుకే బైక్‌పై ఒక వ్యక్తి పైలెట్‌లా వెళ్తున్నాడు. గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అనుమానంతో ఆటోను ఆపి తనిఖీ చేశారు. ఆరు వాషింగ్ మెషిన్లు, 30 సెల్‌ఫోన్లను తరలిస్తుండడాన్ని గమనించి డ్రైవర్‌ను నిలదీశారు. విశాఖ నుంచి విజయవాడకు వాషింగ్ మెషిన్లు తరలిస్తున్నట్లు ఆటో డ్రైవర్ సమాధానమిచ్చాడు. దీంతో వాషింగ్ మెషిన్లను ఒక్కొక్కటి కిందకు దింపి తనిఖీ చేయగా వాటిల్లో రూ.1.30 కోట్ల నగదును గుర్తించారు. వెంటనే ఆటోను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆరు వాషింగ్ మెషిన్లు, సెల్‌ఫోన్లు, ఆటో, బైక్‌లను సీజ్ చేశారు. 41, 102 సిఆర్‌పిసి కింద కేసు నమోదు చేశారు.
ఎలక్ట్రానిక్ షాపు నగదుగా గుర్తింపు
పట్టుబడిన నగదు ఓ ఎలక్ట్రానిక్ షాపునకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. దసరా సేల్ నగదును విజయవాడలోని బ్యాంకులో జమ చేసేందుకు తీసుకెళ్తున్నట్టు ఎలక్ట్రానిక్ షాపు యజమాని వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంత గుట్టుగా భారీ స్థాయిలో నగదు తరలించాల్సి వచ్చిందన్న దానిపై సరైన వివరణ ఇవ్వకపోవడంతో నగదును సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.