May 18,2023 07:36

పిల్లలైనా, పెద్దలైనా స్మార్ట్‌ఫోను అదేపనిగా చూడడం మంచిది కాదు. ఈ అలవాటు వల్ల మానసిక సమస్యలతో పాటు శారీరకంగా కూడా చేటు కలుగుతుంది. అమెరికాకు చెందిన సేపియన్‌ ల్యాబ్స్‌ అనే ఓ స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం... పిల్లలకు స్మార్టఫోన్లు ఇస్తే వారిని మానసిక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని స్పష్టమైంది. మహిళలకు ఈ స్మార్ట్‌ఫోన్ల దుష్ప్రభావం అధికమని కూడా ఆ పరిశోధనలో తేలింది. భారత్‌ సహా 40 దేశాల నుంచి 27,969 మంది డేటాను సమీకరించి ఈ సర్వే చేశారు. వారిలో 4 వేల మంది భారతీయులు కూడా ఉన్నారు. ఆందోళన కలిగించే విషయమేమంటే ... ఆరేళ్ల నుంచే స్మార్ట్‌ఫోన్లు కలిగిఉన్న పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు అధికంగా ఉంటాయని పరిశోధనలో గుర్తించారు.
స్మార్ట్‌ఫోన్లు వినియోగించడం వల్ల పిల్లల స్వభావాల్లో వస్తున్న మార్పును కూడా ఈ సర్వే అంచనా వేసింది. చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకున్న వారిలో దుందుడుకు స్వభావం అధికంగా ఉన్నట్టు తేలింది. ఆరేళ్ల వయసులోనే మొబైల్‌ ఫోన్లు కలిగిన బాలికల్లో ఇతరులతో పోలిస్తే మాససిక ఆరోగ్య సమస్యలు అధికంగా వేధిస్తున్నట్టు కనుగొన్నారు. బాలురలో ఆరేళ్ల నుండే స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న వారిలో 42 శాతం మంది, 18 ఏళ్లకు స్మార్ట్‌ఫోన్‌ను కలిగిఉన్న వారిలో 36 శాతం మంది మానసిక అలజడిని ఎదుర్కొంటున్నట్లు పరిశోధకులు తెలిపారు.
అల్లరి చేస్తున్నారనో.. పనులకు అడ్డం వస్తున్నారనో.. చిన్న పిల్లలకు ఫోన్లు ఇవ్వడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. పిల్లల్లో సహజంగా పెరిగే ఆలోచనలకు పదునుబెట్టాలి. వారిలో దాగున్న నైపుణ్యాలను వెలికితీసి వారి శక్తిసామర్థ్యాలను పెంచడంలో తల్లిదండ్రులు కీలకబాధ్యత వహించాలి. ఈ సర్వే వివరాలు తెలుసుకున్న తరువాతైనా పిల్లలు ఫోను జోలికి పోకుండా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వారిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.