Mar 19,2023 15:33

ఆ రోజు నేను పొలానికి వెళ్ళినపుడు నారాయణ కనిపించలేదు. నారాయణ మా రైతు. ఎప్పుడో మా తాతల కాలం నుంచి నారాయణ కుటుంబమే మా పొలాన్ని సాగుచేస్తోందని మా నాన్న నాకు ఎప్పుడూ చెబుతుండేవాడు. నారాయణ, నేను మూడోతరం వాళ్ళం. మా ఊరి పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను నేను.
రెండవ శనివారం, ఆదివారం రోజుల్లో పొలానికి వెళ్తుంటాను. వ్యవసాయం చేసే అవకాశం లేక మాకున్న ఐదెకరాల పొలాన్ని నారాయణకి శిస్తు కిచ్చేసాను. నా ఒక్కాగానొక్క కొడుకు పట్నంలో డిగ్రీ చదువుతునాడు. వాడికి మా పొలం ఎక్కడుందో తెలియదు. ఈ తరం పిల్లలెవరూ వ్యవసాయం అంటే ఇష్టపడటం లేదు.
నేనెప్పుడు పొలానికి వెళ్ళినా నారాయణ, వాడి కొడుకు పొలంలో ఏదో పనిచేస్తూ కనిపిస్తారు. కానీ ఇవాళ వాళ్ళిద్దర్లో ఎవ్వరూ కనిపించలేదు. నేను చెరువుకి వెళ్ళి మదువు దగ్గర నీటిని బట్టీలోకి వదిలి పొలానికి వచ్చాను.
కార్తీకం కావటంతో వరి పంట అంతా పొట్ట మీద ఉంది. పొట్టకు పుట్టెడు నీళ్ళు అవసరం అంటారు పెద్దలు.. ఈ సమయంలో వరి కంకుల పొట్టకు ఎక్కువ నీరు అవసరం లేకపోతే కవ్వ కింద మారిపోయి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది.
అందుకే ఆ రోజు బట్టిలోకి నీళ్ళు వదలి పొలాల్లోకి వెళ్ళే దాకా అక్కడే నిల్చుని వరి మళ్ళకు పూర్తిగా నీరు అందడంతో బట్టిని కట్టి ఇంటికి బయలుదేరాను. దార్లో నారాయణ ఇంటి దగ్గర ఆగి నారాయణని పిలిచాను. నన్ను చూసి వాడు పరిగెడుతూ వచ్చాడు.
'ఏం నారాయణా! ఈ రోజు పొలానికి వెళ్ళలేదు. ఈ రోజు ఆదివారం కాబట్టి నేను వెళ్లాను .. పొలాల్లో చుక్క నీరు లేదు. ఇప్పుడు నీరు లేకపోతే పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ రోజు నేను నీరు పెట్టానులే. రేపట్నుంచీ జాగ్రత్తగా చూడు' అని వాడికి చెప్పాను.
'రోజూ ఎల్తున్నా బాబూ! ఈ రోజు మా అయ్యకి ఒంట్లో బాగానేదు. నిన్నటి నుంచి యిపరీతమైన జొరం.. ఒల్లు కాలిపోతున్నాది. డాక్టరు బాబు దగ్గరికెల్లి మందులు తెచ్చినాను' అన్నాడు నారాయణ. వాడి మాటలు విన్న తరువాత వాడి తండ్రిని చూడాలనిపించి ఇంటి లోపలికి వెళ్ళాను. నారాయణది ఓ చిన్న ఇల్లు.. మొన్ననే ప్రభుత్వం కట్టిన కాలనీకి మారేడు. రెండే గదులు.. వాడి తండ్రి బయట మంచం మీద పడుకొని కనిపించాడు. నారాయణ తండ్రి సంగన్న నా చిన్నప్పుడు మా పొలాలను చూసేవాడు. ఎప్పుడూ మా ఇంట్లోనే ఉండేవాడు. సంగన్నంటే మా నాన్నకు చాలా ఇష్టం. నేను అతని మంచం దగ్గరకు వెళ్ళి చేతిని పట్టుకొని చూసాను.. వళ్ళంతా వేడిగా ఉంది. జ్వరం బాగా ఉంది.. కళ్ళు తెరవలేకపోతున్నాడు. సంగన్నకి డెబ్భై ఏళ్ళుంటాయి. ఈ మధ్యన అనారోగ్యంతో బయటకు రాలేకపోతున్నాడు.
సంగన్న సన్నకారు రైతు కావడంతో ప్రభుత్వం 3000 రూపాయలు ఫించను ఇస్తున్నాది.. 'నారాయణా! డాక్టరు బాబు వచ్చాడా? మందులిచ్చాడా? జ్వరం బాగా ఉంది' అన్నాను.
'ఒచ్చినాడు బాబూ! గాజు గొట్టం నోట్లో ఎట్టి సూసినాడు. అబ్బో జొరం సాలా ఎక్కువుందని సెప్పి నాలుగు మందు బిల్లల్నిచ్చినాడు. ఈ యాళ రేపు బువ్వెట్టొద్దనీ సెప్పాడు' అని చెప్పాడు నారాయణ...
'నారాయణా! అయ్యని బయటెందుకు పడుకోబెట్టినావు.. ఎండ మంచిది కాదు. లోపలికి తీసికెళ్ళు.. మందుల్ని వెయ్యడం మానకు.. జాగ్రత్తగా చూసుకో, రేపటికి తగ్గిపోద్దిలే..' అని వాడితో చెప్పాను.
'బాబూ, లోపల బోల్డు సామాన్లు.. దాన్నెం ,బుట్టి, అన్నీ ఉన్నాయి.. జాగా లేక అయ్యనిక్కడ పడుకో బెట్టినాను' అన్నాడు వాడు.
నారాయణకి ముగ్గురు పిల్లలు. వాళ్ళందరికీ ఆ ఇల్లు సరిపోదు. తప్పదు. అంతకన్నా ఏమీ చెయ్యలేడు.
వాడి మాటలు నాకు బాధ కలిగించాయి. వాడికి వస్తానని చెప్పి ఇంటి వైపు బయలుదేరాను. 'ఇంతేలే నిరుపేదల బతుకులు..! అవి ఏనాడూ బాగుపడని అతుకులు' అన్న పాట గుర్తుకొచ్చింది నాకు. ఆసమయంలో..
ఆ మర్నాడు నేను పట్నం పనిమీద వెళ్ళినపుడు నా స్నేహితుడు విశ్వనాథం నన్ను ఒక వృద్ధాశ్రమానికి తీసికెళ్ళాడు. అది ఊరికి దూరంగా ఉంది. దాన్ని ఓ ఎన్జీవో నడుపుతోంది.. అందులో వందమంది దాకా పేద వృద్ధులున్నారు. అందరికీ ఉండడానికి మంచి గదులు, శుభ్రమైన భోజనం, తాగడానికి నీరు అన్ని సదుపాయాలూ ఉన్నాయి.
ఆ ఆశ్రమంలో ఉండాలంటే నెలకు రెండు వేల ఐదొందలు రూపాయలు ఇవ్వవలసి ఉంటుందనీ, వాళ్ళకి తిండి, బట్టలతో సహా అన్నీ తామే చూసుకుంటామని అక్కడి ఆశ్రమ నిర్వాహకురాలు చెప్పింది.
నాకెందుకో ఆ సమయంలో నారాయణ తండ్రి సంగన్న మనసులో మెదిలాడు. అతను ఆ చిన్న ఇంట్లో చోటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అతన్ని గానీ ఇక్కడ చేర్పిస్తే అతను సుఖపడతాడు. నారాయణ ఇబ్బంది తప్పుతుందని పించింది.
మర్నాడు పొలంలో నారాయణ నన్ను కలిసినపుడు వాళ్ళ అయ్య సంగన్న ఆరోగ్యం గురించి కనుక్కున్నాను.
'ఆడికి జొరం తగ్గినాది బాబూ.. కానీ నీరసం ఇంక తగ్గనేదు. ఇంకా రెండు రోజులు మందులోడాలనీ డాట్టరు బాబు సెప్పినాడు. ఈయాల బువ్వెడతాము' అన్నాడు నారాయణ.
'నారాయణా! నిన్న పట్నంలో మంచి వృద్ధాశ్రమం చూసాను. అంటే అందులో మీ అయ్య లాంటి వాళ్ళు ఉంటారు. తిండి, బట్ట, ఉండటానికి గది.. అన్నీ వాళ్ళే ఇస్తారు. నెలకు ఓ రెండువేల ఐదొందలు ఇస్తే చాలు. మీ అయ్యి కెలాగూ ఫించనొస్తున్నాది కదా. అది వాళ్ళకిచ్చేస్తే సరి. నీకే బాదర బందీ ఉండదు. నువ్వు పొలం పనులు చక్కగా చూసుకోవచ్చు. ఇక్కడ మొన్న మీ అయ్యను చూసాను కదా. చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. మీ ఇంటి కాడుంటే మీకూ బాధ, ఆడికీ బాధ. నా మాట వినీ ఆ పని చెయ్యి. నువ్వు ఊ అంటే మిగతా ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. నీకు పైసా ఖర్చుండదు. ప్రభుత్వం వాడికి 2500 ఫించనిస్తోంది కదా. దానికది సరిపోద్ది.. ఏమంటావు.. ఆలోచించుకో' అని చెప్పాను నారాయణతో.
నా మాటలకు నారాయణ సమాధానం ఇవ్వకుండా మౌనం దాల్చేడు. నేను చెప్పినది వినీ నారాయణ ఎగిరి గంతేసి ఒప్పుకుంటాడని అనుకున్నాను. కానీ నారాయణ ముఖం చూస్తే అలాంటి భావమేమీ కనిపించలేదు సరికదా కొద్దిగా ఆందోళన కనిపించింది. ఐదు నిముషాల తరువాత ఇంటికి వెళ్ళే ముందు వాడిని మళ్ళీ వాళ్ళయ్య సంగతి అడిగేను. కొద్ది సేపటి తరువాత వాడు మెల్లగా చెప్పడం మొదలు పెట్టాడు.
'బాబూ! నా కుటుంబం సంగతి తమరికి తెలియందేటి సెప్పండి. పంట మీద మీ వాటా పోగా మిగిలిన ధాన్నెం గింజలు మా తిండికి సరిపోవటం నేదు. ఆ గింజల్తో కుటుంబ మంతా సంవచ్చరం మొత్తం తినాల. ఇంక బట్టలకి, మిగతా వోటికి ఖరుసులుండనే వుంతాయి . మా అయ్యకి పెంచను వొత్తోంది కాబట్టే ఇంటి కరుసులొడ్డెక్కుతున్నాయి. మా అయ్య మా ఇంట్లో ఉన్నాడు కాబట్టే పెంచను వొత్తోంది. ఆడునేకపోతే ఆడి పెంచనూ రాదు.. కరుసుకి డబ్బులూ ఉండవు. ఇబ్బందడిపోతాము. అందుకే మా అయ్యని బయటికి పంప.. నేను.. పంపితే ఆడికి బాగుంటాది కానీ మేము ఇబ్బందడిపోతాము. మీ మాట కాదంతున్నందుకు ఏటీ అనుకోవద్దు' అన్నాడు నారాయణ.
వాడి మాటలు నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించాయి. వాడి మాటల్లో స్వార్ధం ఉన్నా నిఖార్సైన నిజం కూడా దాగి ఉంది. వాడు చెప్పే దాకా నాకా విషయం తట్టలేదు. నిజమే పండిన పంటలో సగం నాకిచ్చేస్తే ఆ సగం వాడి కుటుంబానికే మాత్రం సరిపోదు. సంగన్న కొస్తున్న ఫించను ఖర్చులకు ఉపయోగపడుతున్నాది. సంగన్నకి పెద్ద ఖర్చేమీ ఉండదు. నలుగురితో పాటు వాడికింత ముద్ద పడేస్తున్నారు. మందులకి కూడా పెద్ద ఖర్చులేదు. సంగన్న నారాయణ కుటుంబానికి ఓ చేట పెయ్యి లాంటివాడు. ఆవు ఈనిన తరువాత దూడ చనిపోతే దాని చర్మంలో గడ్డి కూరి చేట పెయ్యిని తయారు చేస్తారు. దాన్ని తన పెయ్యను కొని నాకుతూ పూర్తిగా పాలిస్తుంది. అది లేకపోతే పాలివ్వకుండా తన్నేస్తుంది. అలాగే సంగన్న కూడా. అతను వృద్ధుడై మంచం పట్టేసినా అతన్ని చూసి ప్రభుత్వం ఫించనిస్తోంది.
వాడే లేకపోతే అది రాదు. ఇది వినడానికి బాధగా ఉన్నా అందులో చేదు నిజం ఉంది. కూటి కోసం కోటి విద్యలు. మనిషి బతకాలి కదా. నారాయణ చదువుకోకపోయినా అతనికి బతక నేర్చే తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయనిపించింది. కాదు జీవితం నేర్పించి ఉంటుంది.
నాకెందుకో ఇంటి కొస్తుంటే చిన్నప్పుడు మా వూళ్ళో రైతులు ఆవు పెయ్యి చనిపోతే దాని పాల కోసం చేటపెయ్యిని చూపిస్తూ మోసం చెయ్యడం నాకు గుర్తుకి వచ్చింది. అప్పుడు దాని మర్మం నాకు తెలియదు కానీ నారాయణని చూసాక ఇప్పుడు తెలిసింది. అవును, సంగన్న ఇప్పుడు చేటపెయ్యి. ఆ విషయం గుర్తుకు రాగానే నాకు బాధ వేసింది.

- గన్నవరపు నరసింహమూర్తి