Apr 13,2023 07:20
  • చెన్నైపై మూడు పరుగుల తేడాతో రాజస్తాన్‌ విజయం

చెన్నై: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో బుధవారం మరో ఉత్కంఠ మ్యాచ్‌ జరిగింది. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌లో చెన్పై సూపర్‌కింగ్స్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ మూడు పరుగుల తేడాతో గెలిచింది. 176 పరుగుల ఛేదనలో భాగంగా చెన్నై చివరి 6బంతుల్లో 21 పరుగులు చేయాల్సి రాగా.. సందీప్‌ కిషన్‌ వేసిన ఓవర్లో తొలి మూడు బంతులకే చెన్నై 14పరుగులు రాబట్టింది. కానీ సందీప్‌ ఆ తర్వాతి 3బంతులు గుడ్‌లెంగ్త్‌ బంతు లు వేయడంతో 3పరుగులే చేసి ఓటమిపాలైంది.
టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(10) నిరాశపరిచినా.. జాస్‌ బట్లర్‌(52) అర్ధసెంచరీకి తోడు పడిక్కల్‌(38), అశ్విన్‌(30), హెట్‌మైర్‌(30నాటౌట్‌) బ్యాటింగ్‌లో చెలరేగారు. బట్లర్‌.. పడిక్కల్‌(38)తో కలిసి 2వ వికెట్‌కు 77పరుగులు జతచేశారు. కెప్టెన్‌ సంజు(0) డకౌటైనా.. అశ్విన్‌, హెట్‌మెయిర్‌ సాయంతో బట్లర్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో ధృవ్‌ జోరెల్‌(4), హోల్డర్‌(0) వికెట్ల సమర్పించుకొన్నారు. ఆకాశ్‌ సింగ్‌, దేశ్‌పాండే, జడేజాకు రెండేసి, మొయిన్‌కు ఒక వికెట్‌ దక్కాయి. ఛేదనలో చెన్నై ఓపెనర్‌ కాన్వే(50), రహానే(31) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. చివరి 18బంతుల్లో చెన్నై లక్ష్యం భారీగా పెరగడంతో ధోనీ(32), జడేజా(25) పోరాడినా ప్రయోజనం లేకపోయింది. దీంతో చెన్నై జట్టు 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 172పరుగులే చేసి ఓటమిపాలైంది. ఈ గెలుపులో రాజస్తాన్‌ జట్టు పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సందీప్‌కు లభించింది.
బట్లర్‌ ఏ 3వేల పరుగులు
రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జాస్‌ బట్లర్‌ ఐపిఎల్‌లో మూడువేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌ సందర్భంగా బట్లర్‌ ఈ ఫీట్‌ సాధించాడు. బట్లర్‌ 85 ఇన్నింగ్స్‌ల్లో 3వేల మార్క్‌ను అందుకోవడం ద్వారా అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా మూడువేల పరుగుల మార్క్‌ను అందుకున్న మూడో ఆటగాడిగా బట్లర్‌ నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌ తొలి స్థానంలో ఉన్నాడు. గేల్‌ 75 ఇన్నింగ్స్‌ల్లో 3వేల పరుగుల మార్క్‌ను అందుకోగా.. కేఎల్‌ రాహుల్‌ 80 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ అందుకొని రెండో స్థానంలో ఉన్నాడు.