Nov 08,2023 10:16
  • వన్డే ప్రపంచకప్‌లో డబుల్‌ సెంచరీ కొట్టిన మూడో క్రికెటర్‌
  • గాయపడ్డా.. ఆసీస్‌ను ఓటమి అంచుల నుంచి విజయ తీరాలకు చేర్చిన గ్లెన్‌
  • ఆఫ్ఘనిస్తాన్‌పై మూడు వికెట్ల తేడాతో గెలుపుతో సెమీస్‌కు కంగారుజట్టు

ముంబయి : ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ డబుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. ఆఫ్ఘనిస్తాన్‌ నిర్దేశించిన 292పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్‌ 91పరుగులకే 7వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో నిలిచింది. ఆ దశలో మ్యాక్స్‌వెల్‌(201నాటౌట్‌; 218బంతుల్లో 21ఫోర్లు, 10సిక్సర్లు) ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడు. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌(12నాటౌట్‌; 68బంతుల్లో 1ఫోర్‌)తో కలిసి 8వ వికెట్‌క ఏకంగా 202పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు మరో 19బంతుల్లో మిగిలి ఉండగానే విజయానికి చేరి సెమీస్‌కు చేరింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌కు ఓపెనర్‌ ఇబ్రహీం జడ్రాన్‌(129నాటౌట్‌; 8ఫోర్లు, 3సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. గుర్బాజ్‌(21), రామత్‌ షా(30), కెప్టెన్‌ షాహిది(26), అజ్మతుల్లా(22)కి తోడు రషీద్‌ ఖాన్‌(35నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇబ్రహీం చివరి బంతి వరకూ క్రీజ్‌లో నిలిచాడు. దీంతో ఆఫ్ఘన్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 291పరుగుల భారీస్కోర్‌ నమోదు చేసింది. ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ను నవీన్‌ ఉల్‌ హక్‌ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపగా... ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన మిచెల్‌ మార్ష్‌(24)తో కలసి ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(18) స్కోరు బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. వార్నర్‌ను ఒమర్జాయి చక్కటి బంతితో బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాతి బంతికే జోష్‌ ఇంగ్లిస్‌ గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజ్‌లోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌ తొలినుంచే బ్యాట్‌ను ఝుళిపించడం మొదలుపెట్టాడు. మధ్యలో లబుషేన్‌(14) దురదృష్ట వశాత్తూ రనౌట్‌ అయ్యాడు. దీంతో ఆసీస్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టార్‌ బ్యాటర్‌ స్టొయినిస్‌ (6)ను రషీద్‌ ఖాన్‌ మ్యాజిక్‌ బంతితో ఎల్బీడబ్ల్యూ పెవీలి యన్‌కు చేరాడు. మధ్యలో మ్యాక్స్‌వెల్‌ గాయపడ్డా.. ఫోర్లు, సిక్సర్లతోనే మ్యాచ్‌ను ముగించడం విశేషం. ఆస్ట్రేలియా జట్టు 18.3ఓవర్లలో 91పరుగులకు 7వికెట్లు కోల్పోయి ఓటమికోరల్లో నిలిచి.. విజయ తీరాలకు చేరిన తీరు వర్ణణాతీతం. మాక్స్‌వెల్‌ ఇచ్చి న 2 సునాయాస క్యాచ్‌లను జారవిడవడంతో ఆఫ్ఘ న్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నవీన్‌, అజ్మతుల్లా, రషీద్‌ఖాన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మ్యాక్స్‌వెల్‌కు లభించింది.
 

వన్డే ప్రపంచకప్‌లో నేడు...
ఇంగ్లండ్‌ × నెదర్లాండ్స్‌
(వేదిక: పూణే, మ.2.00గం||లకు) వన్డే ప్రపంచకప్‌లో డబుల్‌ సెంచరీ కొట్టిన బ్యాటర్లు...
237 : మార్టిన్‌ గుప్తిల్‌(న్యూజిలాండ్‌).. వెస్టిండీస్‌పై వెల్లింగ్టన్‌లో, 2015
215 : క్రిస్‌ గేల్‌(వెస్టిండీస్‌).. జింబాబ్వేపై, కాన్‌బెర్రా, 2015
201 : గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(ఆస్ట్రేలియా)... ఆఫ్ఘనిస్తాన్‌పై, ముంబయి 2023

స్కోర్‌బోర్డు...
ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి)స్టార్క్‌ (బి)హేజిల్‌వుడ్‌ 21, ఇబ్రహీమ్‌ జడ్రాన్‌ (నాటౌట్‌) 129, రామత్‌ షా (సి)హేజిల్‌వుడ్‌ (బి)మ్యాక్స్‌వెల్‌ 30, షాహిది (బి)స్టార్క్‌ 26, అజ్మతుల్లా (సి)మ్యాక్స్‌వెల్‌ (బి)జంపా 22, నబీ (బి)హేజిల్‌వుడ్‌ 12, రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 35, అదనం 16. (50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 291పరుగులు. వికెట్ల పతనం: 1/38, 2/121, 3/173, 4/210, 5/233 బౌలింగ్‌: స్టార్క్‌ 9-0-70-1, హేజిల్‌వుడ్‌ 9-0-39-2, మ్యాక్స్‌వెల్‌ 10-0-55-1, కమిన్స్‌ 8-0-47-0, జంపా 10-0-58-1, హెడ్‌ 3-0-15-0, స్టొయినీస్‌ 1-0-2-0
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (బి)అజ్మతుల్లా 18, హెడ్‌ (సి)ఇక్రమ్‌ (బి)నవీన్‌-ఉల్‌-హక్‌ 0, మిఛెల్‌ మార్ష్‌ (ఎల్‌బి)నవీన్‌-ఉల్‌-హక్‌ 24, లబూషేన్‌ (రనౌట్‌)రామత్‌ 14, ఇంగ్లిస్‌ (సి)ఇబ్రహీమ్‌ (బి)అజ్మతుల్లా 0, మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌), 201; స్టొయినీస్‌ (ఎల్‌బి)రషీద్‌ ఖాన్‌ 6, మిఛెల్‌ స్టార్క్‌ (సి)ఇక్రమ్‌ (బి)రషీద్‌ ఖాన్‌ 3, పాట్‌ కమిన్స్‌ (నాటౌట్‌) 12, అదనం 15. (46.5ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 293పరుగులు. వికెట్ల పతనం: 1/4, 2/43, 3/49, 4/49, 5/69, 6/67, 7/91 బౌలింగ్‌: ముజీబ్‌-ఉర్‌-రెహ్మాన్‌ 8.5-1-72-0, నవీన్‌-ఉల్‌-హక్‌ 9-0-47-2, అజ్మతుల్లా 7-1-52-2, రషీద్‌ ఖాన్‌ 10-0-44-2, నూర్‌ అహ్మద్‌ 10-1-53-0, మహ్మద్‌ నబి 2-0-20-0