
ఫిఫా : ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్రీడా వేడుకలు ఖతర్‌లో ఆదివారం అంబరాన్నంటేలా అద్వితీయంగా జరిగిన సంగతి విదితమే. ఖతార్ రాజధాని దోహాలో నూతనంగా నిర్మించిన అల్ బయత్ స్టేడియంలో నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చూపరులను కట్టిపడేశాయి. అయితే నిన్న జరిగిన ఖతార్, ఈక్వడార్ ప్రారంభ మ్యాచ్‌లో వి వాంట్ బీర్ నినాదాలు స్టేడియాన్ని హౌరెత్తించాయి.
బీర్ల అమ్మకాలు నిషేధం.. బీర్లు కావాలంటూ నినాదాలు...
వరల్డ్ కప్‌లో ఆల్కహాల్‌పై నిషేధం విధిస్తూ చివరి నిమషంలో ఫిఫా నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ... అన్ని స్టేడియంలలో బీర్ల అమ్మకాలను నిషేధిస్తూ ఖతార్ నిర్ణయం తీసుకుంది. ఈక్వడార్ అభిమానులు స్టాండ్‌లలో నిల్చని తమకు బీర్ కావాలంటూ గట్టిగా అరిచారు. ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
విమర్శకులకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన ఫిఫా అధ్యక్షుడు
వరల్డ్ కప్ జరిగే స్టేడియాల్లో ఆల్కహాల్‌పై నిషేధం విధించడం పట్ల అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. చాలామంది ఫిఫా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దాంతో, ఫిఫా అధ్యక్షుడు గియన్ని ఇన్‌ఫాంటో దోహాలో జరిగిన మీడియా సమావేశంలో స్పందించారు. ' ఒక రోజులో మూడు గంటలు బీరు తాగకున్నా మీరు బతుకుతారని నేను అనుకుంటున్నాను ' అంటూ విమర్శకులకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు. అంతేకాదు 'ఇప్పుడు ఉన్నవాటిలో ఆల్కహాల్‌పై నిషేధం అనేది పెద్ద సమస్య అయితే నేను బీచ్‌కి వెళ్తాను. డిసెంబర్ 18వ తేదీ వరకు అక్కడే సేదతీరుతాను' అని ఇన్‌ఫాంటో అన్నారు. దాంతో, ఆయన వ్యాఖ్యలపై కొందరు అభిమానులు మండిపడుతున్నారు.
ఎనిమిది స్టేడియాల్లో బీరు అమ్మకాలపై నిషేధం...
వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరిగే ఎనిమిది స్టేడియాల్లో బీరు అమ్మకాలపై నిషేధం వర్తిస్తుంది. అయితే ఫిఫా ఫ్యాన్ ఫెస్టివల్, లైసెన్స్ ఉన్న కేంద్రాల్లో ఆల్కహాల్ దొరుకుతుంది. ముస్లిం దేశమైన ఖతర్‌లో మామూలుగానే ఆల్కహాల్‌పై నిషేధం ఉంటుంది. అక్కడ కొన్ని హౌటళ్లు, రెస్టారెంట్లలో మాత్రమే ఆల్కహాల్ దొరుకుతుంది.