కుల వివక్షతతో మాదిగ శ్రీనివాసులు బలవన్మరణం.. కారకులను అరెస్టు చేసి శిక్షించాలి : ఓ పి డి ఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు
ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్ : అగ్రకుల అహంకారంతో ఉద్దేశ్యపూర్వకంగా మాదిగ శ్రీనివాసులును మానసికంగా హింసించి ఆయన ఆత్మహత్యకు కారకులైన నిందితులు తుడుములదిన్నె గ్రామానికి చెందిన అగ్రకుల పెత్తందారులు అయిన పేరెడ్డి మోహన్ రెడ్డి, కర్నాటి శేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డిలను కఠినంగా శిక్షించాలని ఓ పి డి ఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.కరుణాకర్ రావు, జిఎల్.నరసింహుడు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
సంఘటన వివరాలను కరుణాకర్, నరసింహుడు వివరించారు. వారి వివరాల మేరకు ... ఈ నెల 15 న సాయంత్రం 4 గంటల సమయములో ఉయ్యాలవాడ మండలం, తుడుములదిన్నె గ్రామానికి చెందిన శివవరం మాదిగ శ్రీనివాసులు మేకలు మేపుకుంటుండగా అదే గ్రామానికి చెందిన నందవరపు గోపాల్ రెడ్డి అతని తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఇద్దరూ కలసి శ్రీనివాసులతో వారి పొలం దగ్గర మేకలు మేపుకోవద్దని బెదిరించారు. దీంతో శ్రీనివాసులు మేకలు వంకలో మేపుకుంటే మీకు నష్టమేమి అనడంతో ... వారు దుర్భాషలాడారు. '' మాదిగ.. మాకే ఎదురు చెపుతావా '' అని శ్రీనివాసులును కర్రతో కొట్టి, కింద పడేసి కాళ్ళతో తన్నారు. అక్కడే ఉన్న శ్రీనివాసులు భార్య, చుట్టుపక్కలవారు వచ్చి శ్రీనివాసులను విడిపించారు. ఎం.శ్రీనివాసులు గోపాల్ రెడ్డి మీద, మధుసూదన్ రెడ్డి మీద ఉయ్యాలవాడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి మీద కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడం భరించలేని తుడుములదిన్నె గ్రామానికి చెందిన అగ్రకుల పెత్తందారులు అయిన పేరెడ్డి మోహన్ రెడ్డి, కర్నాటి శేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి శనివారం రాత్రి శ్రీనివాసులును, అతని భార్యను మోహన్ రెడ్డి ఇంటి దగ్గరకు పిలిపించుకొని కేసు వాపసు తీసుకోవాలనీ.. లేకపోతే మీరు ఊర్లో ఉండలేరు, మీ అంతు చూస్తాం.. మాకు రాజకీయ పలుకుబడి ఉంది అని బెదిరించారు. శ్రీనివాసులు వారికి భయపడి మనస్తాపం చెంది ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనను ఓ.పి.డి.ఆర్. కర్నూలు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని, ఘటనకు కారకులైనవారికి కఠిన శిక్ష పడేలా పోలీస్ వ్యవస్థ చర్యలు చేపట్టాలని కరుణాకర్, నరసింహుడు కోరారు. శ్రీనివాసులు మఅతికి కారకులైన మోహన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలనీ, అగ్రకుల పెత్తందారుల నుండి బాధిత కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలనీ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని, కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.