- మంత్రి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి
- ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాలలు,కళాశాలల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రకమిటీ డిమాండ్ చేసింది. పాఠశాల, కళాశాలల్లో సనాతన ధర్మ బోధనను ప్రారంభిస్తామని దేవాదాయ శాఖమంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కె ప్రసన్నకుమార్, ఎ అశోక్ కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 6వ తేదిన కాకినాడ జిల్లా అన్నవరం నుంచి పాఠశాలలు, కళాశాలల్లో సనాతన ధర్మప్రచార కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి ప్రకటించడం దారుణమని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో భిన్న మతాలు, భిన్న సంస్కృతులకు చెందిన విద్యార్ధులు చదువుతూ ఉంటారని తెలిపారు. వారందరిలో శాస్త్రీయ దృక్పథాన్ని, లౌకిక వాదాన్ని పెంపొందించాలని సూచించారు. మత కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్ధుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.