Nov 11,2023 09:23
  • అధ్యక్షునిగా అతీక్‌ అహ్మద్‌, ప్రధాన కార్యదర్శిగా దీపక్‌కుమార్‌
  • మతోన్మాద ఎబివిపికి ఘోర పరాభవం

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి ఘనవిజయం సాధించింది. ఎస్‌ఎఫ్‌ఐ-ఎఎస్‌ఎ-టిఎస్‌ఎఫ్‌ కూటమి అభ్యర్థులందరూ గెలుపొందారు. ప్రగతిశీల శక్తులు, అభ్యుదయ భావాలకే విద్యార్థులు పట్టం కట్టారు. హెచ్‌సియు విద్యార్థి సంఘం ఎన్నికలు ఈ నెల 8, 9 తేదీల్లో జరిగాయి. ఓట్ల లెక్కింపు యూనివర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించారు. మొదటి రౌండ్‌ నుంచి ఎస్‌ఎఫ్‌ఐ కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అన్ని పోస్టులనూ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ ఎన్నికల్లో మతోన్మాద ఎబివిపికి ఘోర పరాభవం ఎదురైంది. విశ్వవిద్యాలయాల్లో మతోన్మాద రాజకీయాలకు తావులేదని ఈ తీర్పు ద్వారా విద్యార్థులు మరోసారి తేల్చి చెప్పారు. హెచ్‌సియు విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎస్‌ఎఫ్‌ఐ అభ్యర్థి అతీక్‌ అహ్మద్‌ 471 ఓట్ల మెజార్టీతో ఎబివిపి అభ్యర్థిపై విజయ కేతనం ఎగుర వేశారు. ఎస్‌ఎఫ్‌ఐ కూటమి తరుఫున ఉపాధ్యక్షులుగా జె ఆకాశ్‌ 388 ఓట్లు, ప్రధాన కార్యదర్శిగా దీపక్‌ కుమార్‌ ఆర్య 480 ఓట్లు, సంయుక్త కార్యదర్శిగా లావుడి బాల ఆంజనే యులు 641 ఓట్లు, సాంస్కృతిక కార్యదర్శిగా సమీన్‌ అక్తర్‌ 452 ఓట్లు, క్రీడల కార్యదర్శిగా అతుల్‌ 236 ఓట్ల మెజార్టీతో ఎబివిపి అభ్యర్థులపై విజయం సాధించారు. ఎస్‌ఎఫ్‌ఐ నుంచి జిఎస్‌ క్యాష్‌ ఇంటిగ్రేడెట్‌ స్థానానికి నందన పలికిల్‌, జిఎస్‌ క్యాష్‌ పిజి స్థానానికి పూజ, జిఎస్‌ క్యాష్‌ రీసెర్చి స్థానానికి సౌమ్య మిగతా 5లో గెలుపొందారు. ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థులందరూ ఘనవిజయం సాధించడంతో అక్కడ సంబరాలు అంబరాన్నంటాయి. గెలిచిన అభ్యర్థులను విద్యార్థులు ఎత్తుకుని హెచ్‌సియు ప్రాంగణమంతా నినాదాలతో ఊరేగించారు. ఈ సమయంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఎఎస్‌ఎ, టిఎస్‌ఎఫ్‌ జెండాలు రెపరెపలాడాయి. డప్పు, బ్యాండ్‌ బాజాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.