Aug 05,2023 22:36

తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి
న్యూఢిల్లీ : రాజ్యాంగంలోని 370వ అధికరణ కింద జమ్మూ కాశ్మీర్‌కు గల ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ఆగస్టు 5తో నాలుగేళ్లు గడిచాయి. రాజ్యాంగంపై, సమాఖ్యవాదంపై జరిపిన ఈ దాడి, జమ్ము కాశ్మీర్‌ ప్రజల హక్కులపై అన్ని రకాల దాడులకు ముందస్తు సంకేతంగా వుందని సిపిఎం కేంద్ర కమిటీ విమర్శించింది. న్యూఢిల్లీలో సమావేశమైన సిపిఎం కేంద్ర కమిటీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
నివాస చట్టాల్లో, భూ హక్కుల్లో మార్పులు తీసుకురావడం ద్వారా జమ్ము కాశ్మీర్‌ మూల గుర్తింపును మార్చేందుకు గత ఐదేళ్ల కేంద్ర పాలనలో చర్యలు తీసుకోవడాన్ని చూశాం. రాష్ట్ర జనాభా నిష్పత్తిలో మార్పు తీసుకురావడానికి అదేపనిగా యత్నిస్తోంది.
ప్రజా భద్రతా చట్టం, యుఎపిఎ వంటి క్రూర చట్టాలను ఉపయోగించి ఈ కాలంలో పెద్ద ఎత్తున రాజకీయ నేతలు, కార్యకర్తలపై నిర్బంధాన్ని ప్రయోగించింది. వందలాదిమంది రాజకీయ ఖైదీలు ఇంకా నిర్బంధంలోనే వున్నారు. వారిలో చాలా మంది జమ్ము కాశ్మీర్‌ వెలుపల జైళ్లలో వున్నారు.
ఎంతగా గొప్పలు చెప్పినప్పటికీ, అధిక నిరుద్యోగంతో ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారింది. జాతీయ సగటు కన్నా మూడు రెట్లు ఎక్కువగా నిరుద్యోగులు వున్నారు. యాపిల్‌ రైతులు, చిన్న వ్యాపారస్తులు వంటి వివిధ వర్గాలకు చెందిన ప్రజల జీవనోపాధి దారుణంగా దెబ్బతింది.
మీడియా తీవ్రమైన ప్రభుత్వ అణచివేతను ఎదుర్కొంటోంది. సెన్సార్‌షిప్‌ను విధిస్తూ, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తూ మార్గదర్శకాలు రుద్దారు. నిరంకుశమైన చట్టాలను ఉపయోగించి అనేక మంది జర్నలిస్టులను అరెస్టు చేశారు.
జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడంలో విఫలమవడంలోనే ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ప్రజాతంత్ర హక్కులను మౌలికంగా తిరస్కరించడమనేది స్పష్టంగా అగుపిస్తోంది. బిజెపి ప్రయోజనాలకు అనుకూలంగా, కాశ్మీర్‌ లోయలోని ప్రజల ప్రాతినిధ్యాన్ని కుదిస్తూ నియోజకవర్గాల విభజన ప్రక్రియ సాగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడం లేదు.
అందువల్ల, అన్ని రకాలుగా, జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు రెండవ తరగతి పౌరులుగా కుదించబడ్డారు. అందువల్ల జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీకి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం కేంద్ర కమిటీ డిమాండ్‌ చేస్తోంది.ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమంటే రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాల్సి వుంది. రాజకీయ వ్యతిరేకతను, మీడియాను అణచివేయడానికై నిరంకుశ చట్టాలను ఉపయోగించడానికి స్వస్తి పలకాలి. జమ్మూ కాశ్మీర్‌ శాశ్వత నివాసుల నివాస స్థితిని తుడిచిపెట్టే చర్యలన్నింటినీ కేంద్రం వెనక్కి తీసుకోవాలి. వారి భూ హక్కులను కాపాడాలి. తమ హక్కుల పునరుద్ధరణ కోసం పోరు సల్పే జమ్మూ కాశ్మీర్‌ ప్రజలకు, ప్రజాతంత్ర శక్తులకు కేంద్ర కమిటీ సంఘీభావాన్ని తెలియజేస్తోంది.