Jan 22,2023 09:56

తుపాకీతో కాల్చి చంపిన
బొలీవియా సైనికుని మాటల్లోనే..

గెరిల్లా పోరాట యోధుడు ఎర్నెస్టో చే గువేరాపై ఉన్నతాధికారుల ఆదేశాలతో తుపాకి ఎక్కుపెట్టి కాల్చి చంపిన మారియో టెరాన్‌ (తరువాత దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ తన 80వ ఏట చనిపోయాడు) అనే బొలీవియన్‌ సిపాయి ఆ విప్లవ వీరుడి గురించి 'రేడియో కేంపాఫియెరా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ విశేషాలు అతని మాటల్లోనే....
'ఆ రోజు ఒక ఆర్మీ సిపాయిగా నా విధి నేను నిర్వర్తించక తప్పలేదు. అప్పటికే గాయపడి ఉన్న అర్జెంటీనా వైద్యుడు, విప్లవకారుడు చే గువేరాను కాల్చి చంపేయమంటూ పై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను శిరసావహించి, ఆ పని చేయాల్సి వచ్చింది. నా జీవితంలో ఇది అత్యంత దారుణమైన ఉదంతంగా మిగిలిపోతుందని ఆ ఘటన జరిగిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అన్నాను. చే గువేరా ఛాతీకి తుపాకీని గురిపెట్టిన సమయంలో ఆ గెరిల్లా యోధుడు భారీగా, చాలా ఉన్నతంగా అగుపించాడు. ఆయన కళ్లల్లో తీక్షణత, మెరుపు తొణికిసలాడాయి. ఒక్క ఉదుటున నాపై దుమికి వస్తాడేమోనని అనుకున్నా. కానీ, ఆయన నిశ్చలంగా, నిర్భయంగా ఉన్నాడు. చేపైకి తుపాకీని గురిపెడుతున్నప్పుడు నన్ను నేనే నిందించుకున్నాను. నాలో దుఃఖం ముంచుకొచ్చింది. నిగ్రహంతో ఉండు అని ఆయన సముదాయించాడు. నా ముందున్న లక్ష్యం స్పష్టం. ఒక మహా మనిషిని చంపబోతుండడం. ఒకడుగు వెనక్కు వేసి, తలుపు దగ్గరకెళ్లాను. కళ్లు మూసుకుని గువేరాపై కాల్పులు జరిపాను. (టెరాన్‌ మొదట పేల్చిన తూటాలు గువేరా ఛాతీని తాకలేదు. అయితే అంతిమంగా తాకాయి అని చే జీవిత చరిత్ర రాసిన వారు పేర్కొన్నారు)'

  • రెండు చేతులను ఖండించారు.. అమెరికా కిరాతకానికి పరాకాష్ట

విప్లవ యోధుడు చే గువేరాను పట్టుకుని బంధించి, ఓ పాఠశాల గదిలో కాల్చి చంపడమే దుర్మార్గమనుకుంటే, ఆయన రెండు చేతులు, మృత శరీరం నుంచి కత్తిరించడం అమెరికా సామ్రాజ్యవాదుల కిరాతకత్వానికి పరాకాష్ట. అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండ్సే జాన్సన్‌ ఆదేశానుసారమే ఇదంతా జరిగిందనేది నిర్వివాదాంశం. చే గువేరాతో నేరుగా తలపడే ధైర్యం లేక పిరికిపంద మాదిరి అమెరికా వ్యవహరించింది. ప్రపంచంలో మానవ హక్కుల గురించి సుద్దులు చెప్పే అగ్రరాజ్యం చే పట్ల అనుసరించిన ఈ వైఖరిపై ఆనాడు పెద్దయెత్తున విమర్శలు చెలరేగాయి. చే గువేరాను అక్టోబరు9న కాల్చి చంపించిన అమెరికా, ఆ మరుసటి రోజు అర్ధ రాత్రి ఆయన భౌతిక కాయాన్ని మాయం చేసింది. రెండు చేతులను కత్తిరించి రసాయనిక ద్రావకం ఉన్న జాడీలో ఉంచింది. తరువాత ఆ మృత దేహాన్ని వాలెగ్రాండెలో పాడుబడ్డ విమానాశ్రయంలో బుల్‌డోజర్లతో గొయ్యితీసి ఖననం చేసింది. ఎదురు కాల్పుల్లో గాయాలతో చే మరణించినట్లు ఆ తరువాత విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. మేరునగధీరుడైన ఆ గెరిల్లా యోధుడికి అంజలి ఘటించే వీలు లేకుండా చేసింది. చే డైరీ ఫొటో కాపీలు - ఆ ఖండిత హస్తాలు, మాస్క్‌ - బొలీవియా అంతర్గత మంత్రిగా వ్యవహరించిన ఆంటోనియా ఆర్గ్యుడాస్‌ తరపు ఏజెంట్లు ఆ దేశ సరిహద్దులను దాటించారు. ఆర్గ్యుడాస్‌ అటు సిఐఎతోనూ ఇటు బొలీవియా కమ్యూనిస్టు పార్టీతోనూ సంబంధ బాంధవ్యాలు నెరిపేవాడు. ఈ వ్యవహారం బట్టబయలు కావడంతో ఆర్గ్యుడాస్‌ దేశం విడిచి పారిపోయాడు. కొంత కాలం క్యూబాలో ఆశ్రయం పొందాడు.