
- చేగువేరా మెమోరియల్ రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ప్రారంభం
ప్రజాశక్తి - ఎడ్యుకేషన్ (ఎన్‌టిఆర్ జిల్లా) : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రావీణ్యతను పెంచుకొని మంచి క్రీడాకారులుగా ఎదగాలని పలువురు వక్తలు అన్నారు. చేగువేరా 95వ జయంతి సందర్భంగా చేగువేరా మెమోరియల్ రాష్ట్ర చెస్ టోర్నమెంట్ విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ప్రారంభమైంది. టోర్నమెంట్‌ను తొలుత ఉమెన్ గ్రాండ్ మాస్టర్ ప్రియాంక ప్రారంభించి మాట్లాడారు. విజయవాడ నగరంలో చేగువేరా పేరుతో రాష్ట్ర స్థాయి పోటీలు జరగడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. చెస్ క్రీడ మంచి విజ్ఞానంతోపాటు ఆసక్తిని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ క్రీడలపై ఆసక్తి పెంచుకొని సాధన చేస్తే మంచి క్రీడాకారులుగా తయారవుతారని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరగాలని అకాక్షించారు. పోటీల్లో విజేతలైన క్రీడాకారులకు రూ.40 వేల ప్రైజ్‌మనీతోపాటు 25 మందికి మెమోంటోలు, సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. చేగువేరా చెస్ పోటీల నిర్వహణ కమిటీ అధ్యక్షులు, పాపులర్ షూ మార్టు అధినేత చుక్కపల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ యువతకు క్రీడల పట్ల ఆసక్తి కలిగించాలన్న ఉద్దేశంతోనే ఈ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. నిర్వహణ కమిటీ కన్వీనర్ జి.రామన్న మాట్లాడుతూ ఎపి చెస్ అసోసియేషన్, ఎన్‌టిఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ ససహకారంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు డి.రమాదేవి, నక్కా వెంకటేశ్వర్లు, టి.క్రాంతి కిరణ్, శ్రీనివాస్, అశోక్, యు.వి.రామరాజు పాల్గొన్నారు.



