
ప్రజాశక్తి-సూళ్లూరుపేట : ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో చంద్రునిపై ఉపగ్రహాలు పంపించడం ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది.ప్రస్తుతం చంద్రయాన్-3 కూడా అంతే. ఇతర దేశాలు చంద్రునిపై కాలు మోపి ఎన్నో పరిశోధనలు చేపట్టినప్పటికీ భారత్ ఈ చల్లని గ్రహంపై ఇంకా ఉపగ్రహాన్ని సాఫ్ట్ గా దింపలేకపోతోంది. అయినప్పటికీ ప్రస్తుతం చంద్రయాన్-3 పై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల అంతరిక్ష శాస్త్రవేత్తలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. భారత్ ఇప్పటికి రెండుసార్లు ఈ దశలో అవాంతరాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం చంద్రయాన్-3 లో ఉపయోగిస్తున్న ఉపకరణాలు అత్యంత శక్తివంతమైనవి. చంద్రుని కక్ష నుంచే భూమిపై పరిశోధనలు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి.పైగా చంద్రుని దక్షిణ ధ్రువం పై ఇప్పటికీ ఏ దేశము చేయని పరిశోధనల కోసం చంద్రయాన్-3 ని ప్రయోగిస్తున్నారు.
- షార్ లో కొనసాగుతున్న ఏర్పాట్లు
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో చంద్రయాన్-3 ప్రయోగం కోసం తుది ఏర్పాట్లు జోరందుకున్నాయి. భారత్ ఇటీవల వలె ఎల్విఎం-3 రాకెట్ ను చంద్రయాన్-3 ఉపగ్రహం ప్రయోగానికి ఉపయోగిస్తున్నారు. ఎల్విఎం3 -04 పేరుతో ఈ రాకెట్ రూపొందించగా, 3900 కిలోల బరువైన చంద్రయాన్-3 ని అలవాలగా చంద్రుని సమీపం వరకు మోసుకెళ్లే సామర్ధ్యాన్ని ఈ భారీ రాకెట్ కలిగి ఉంది. ఈనెల 14న మధ్యాహ్నం రెండు గంటల 2.35 గంటలకు శ్రీహరికోటలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరుగునుండగా 40 రోజుల అనంతరం ఆగస్టు 23న చంద్రునిపై ఉపగ్రహంలోని ల్యాండర్ సాఫ్ట్ గా దిగాల్సి ఉంది. అది జరిగిన తర్వాత ల్యాండర్లో అమర్చిన రోవర్ 14 రోజులపాటు చంద్రునిపై నిర్దేశించిన ప్రదేశంలో పరిశోధనలు జరిపి ప్రపంచ శాస్త్రవేత్తలకు సమాచారం అందిస్తుంది.
- 21 దాకా లాంచ్ విండో
మనకు, చంద్రునికి దగ్గరగా ఉండే రోజుల్లోనే చంద్రయాన్ ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి ఉంది. ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. దీనినే లంచ్ విండో అంటారు. ఈ సమయాన్ని మనం ఉపయోగించుకుని చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే అనుకున్న లక్ష్యానికి దాన్ని ప్రవేశపెట్టవచ్చు. అలా జరిగితే ఉపగ్రహంలోని ఇంధనం కూడా కలిసి వస్తుంది. ఈ లాంచ్ విండో కాలం వెళ్లిపోయిన తర్వాత మరో ఆరు నెలల పాటు చంద్రయాన్ని ఉపగ్రహ ప్రయోగం జరిపే అవకాశం లేదు. ఈ కారణంగా శాస్త్రవేత్తలు ఈనెల 14,19 తేదీలు మధ్యనే షార్ నుంచి చంద్రయాన్-3ని ప్రయోగించాలని శ్రమిస్తున్నారు. ఒకవేళ మరో రోజు వాయిదా పడినా ఈనెల 15న కచ్చితంగా ఈ ఉపగ్రహ ప్రయోగం ఉంటుందని శాస్త్రవేత్తలు ద్వారా తెలుస్తోంది.